-->

సవతుల గొడవ.. ఇద్దరి ప్రాణాలు బలి ఒకరు దాడిలో మృతి.. మరొకరు పురుగుల మందు తాగి ఆత్మహత్య

 

సవతుల గొడవ.. ఇద్దరి ప్రాణాలు బలి ఒకరు దాడిలో మృతి.. మరొకరు పురుగుల మందు తాగి ఆత్మహత్య

సవతుల గొడవ.. ఇద్దరి ప్రాణాలు బలి ఒకరు దాడిలో మృతి.. మరొకరు పురుగుల మందు తాగి ఆత్మహత్య

ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సవతుల మధ్య జరిగిన గొడవ చివరకు ఇద్దరు మహిళల ప్రాణాలను బలితీసుకుంది. వాంకిడి మండలం సోనాపూర్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

గ్రామానికి చెందిన ఆత్రం కన్నుకు రాంబాయి, సాకృబాయి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. ఈ నెల 5న ఇద్దరు మహిళల మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన మొదటి భార్య రాంబాయి.. రెండో భార్య సాకృబాయిపై కర్రతో దాడి చేసింది. ఈ దాడిలో సాకృబాయి తీవ్రంగా గాయపడింది.

కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ శుక్రవారం సాకృబాయి మృతి చెందింది.

మరోవైపు ఈ ఘటన అనంతరం రాంబాయి భయాందోళనకు గురై గ్రామం విడిచి వెళ్లి సమీపంలోని పొలంలో తలదాచుకుంది. పోలీసులు తన కోసం గాలిస్తున్నారనే విషయం తెలుసుకున్న ఆమె శనివారం మధ్యాహ్నం పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సాకృబాయి మృతదేహం ఇంటికి చేరకముందే రాంబాయి కూడా మృతి చెందడంతో సోనాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది.

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు కొద్ది రోజుల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోవడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గొడవకు దారితీసిన కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793