-->

అంగన్‌వాడీలో డూప్లికేట్ టీచర్ కలకలం.. 9 ఏళ్లుగా అసలు టీచర్ గైర్హాజరు!

 

అంగన్‌వాడీలో డూప్లికేట్ టీచర్ కలకలం.. 9 ఏళ్లుగా అసలు టీచర్ గైర్హాజరు!

అంగన్‌వాడీలో డూప్లికేట్ టీచర్ కలకలం.. 9 ఏళ్లుగా అసలు టీచర్ గైర్హాజరు!

మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాల అంగన్‌వాడీ కేంద్రంలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. విధులు నిర్వహించాల్సిన అసలు అంగన్‌వాడీ టీచర్ స్థానంలో గత 9 ఏళ్లుగా మరో మహిళతో విధులు చేయిస్తున్న ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం బయటపడటంతో ఐసీడీఎస్ అధికారులు విచారణ ప్రారంభించారు.

సమాచారం ప్రకారం, నాగసాల అంగన్‌వాడీ కేంద్రానికి టీచర్‌గా జ్యోతిలక్ష్మి నియమితులయ్యారు. అయితే కొద్ది రోజులపాటు మాత్రమే విధులకు హాజరైన ఆమె, అనంతరం లావణ్య అనే మహిళతో తన స్థానంలో విధులు నిర్వహింపజేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు ప్రతిగా నెలకు రూ.6 వేల పారితోషికం చెల్లిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

మొదట్లో ఆయా లేకపోవడంతో తాత్కాలికంగా లావణ్యను పెట్టినట్లు చెప్పినా, తర్వాత ఆయా నియామకం జరిగినప్పటికీ అసలు టీచర్ విధులకు హాజరు కాకుండా డూప్లికేట్ టీచర్‌తోనే కేంద్రాన్ని నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేంద్రంలో సుమారు 20 మంది చిన్నారులు సేవలు పొందుతున్నారు.

ఈ వ్యవహారంపై గతంలోనే కొందరు స్థానికులు సీడీపీఓకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విషయం మంగళవారం మీడియాలో వెలుగులోకి రావడంతో సీడీపీఓ శోభారాణి నాగసాల అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి విచారణ చేపట్టారు.

విచారణ సందర్భంగా గ్రామంలోని గర్భిణులు, బాలింతలు లావణ్యే విధులు నిర్వహిస్తున్నారని, అసలు టీచర్ అప్పుడప్పుడు మాత్రమే వస్తారని తెలిపినట్లు సమాచారం. లావణ్య కూడా తాను 9 ఏళ్లుగా పనిచేస్తున్నానని, టీచర్ నెలకు రూ.6 వేల చెల్లిస్తున్నారని అధికారులకు వెల్లడించినట్లు తెలిసింది.

మరోవైపు అసలు టీచర్ జ్యోతిలక్ష్మి స్పందిస్తూ, "ఇదేమీ పెద్ద తప్పు కాదు.. ఆమెకు నేను డబ్బులు ఇస్తున్నాను. నేను ఇతర ప్రక్రియల్లో బిజీగా ఉన్నాను" అని చెప్పినట్లు సమాచారం.

ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు, విచారణ నివేదిక ఆధారంగా తగిన చర్యలు ఉంటాయని సీడీపీఓ శోభారాణి తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793