సరైన పత్రాలు లేని 250 వాహనాలు స్వాధీనం.. ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరిక
సరైన పత్రాలు లేని 250 వాహనాలు స్వాధీనం.. ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరిక
అదిలాబాద్, ఆగస్టు 5: వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు లేకుండా రోడ్లపై వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని అదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు.
బుధవారం తెల్లవారుజామున ఆదిలాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ నగర్‌లో ఎస్పీ ఆధ్వర్యంలో 'కమ్యూనిటీ కాంటాక్ట్' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో సరైన పత్రాలు లేని 250 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే మూడు బెల్ట్‌షాపుల నుంచి మద్యం బాటిళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా ఆన్‌లైన్ మట్కా నిర్వహిస్తున్న ముగ్గురిని, వాహనాల నంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేసిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, తల్లిదండ్రులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాత్రి వేళల్లో అనవసరంగా రోడ్లపై తిరిగేవారిపై కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. జిల్లాలోని వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, పాత వాహనాలు కొనుగోలు చేసే ముందు వాటి పత్రాలను పూర్తిగా పరిశీలించాలని సూచించారు. ప్రజలు తమ ఇళ్లతో పాటు వ్యాపార సంస్థల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ కోరారు.

Post a Comment