ఖమ్మంలో భారీగా గంజాయి పట్టివేత.. 324 కిలోలు స్వాధీనం
ఖమ్మంలో భారీగా గంజాయి పట్టివేత.. 324 కిలోలు స్వాధీనం
ఖమ్మం జిల్లాలో మరోసారి భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా నగరంలోకి గంజాయి రవాణా జరుగుతోందనే విశ్వసనీయ సమాచారంతో కూసుమంచి పోలీసులు జీళ్లచెరువు వద్ద ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ కారును పోలీసులు అడ్డుకుని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, కారులోని సీట్ల కింద అత్యంత చాకచక్యంగా దాచిన 324 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ప్రాథమిక విచారణలో నిందితులకు రాజమండ్రి, బెంగళూరు, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లోని గంజాయి స్మగ్లర్లు, వ్యాపారులతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక ముఠాగా ఏర్పడి అక్కడి నుంచి గంజాయిని వాహనాల ద్వారా తెలంగాణలోని పలు ప్రాంతాలకు అక్రమంగా తరలించి, అధిక ధరలకు విక్రయిస్తూ భారీగా అక్రమ లాభాలు పొందుతున్నట్లు వెల్లడైంది.
ఈ కేసులో అరెస్టైన నిందితులను విచారిస్తున్న పోలీసులు, ఈ అక్రమ రవాణా నెట్‌వర్క్ వెనుక ఉన్న ఇతర కీలక వ్యక్తులను గుర్తించే దిశగా దర్యాప్తును ముమ్మరం చేశారు. అలాగే ఈ ముఠా గతంలో నిర్వహించిన గంజాయి రవాణా వ్యవహారాలపై కూడా ఆరా తీస్తున్నారు.

Post a Comment