నిశ్చితార్థం రద్దు చేసుకుందని యువతికి యాసిడ్ పోస్తానంటూ బెదిరింపులు
నిశ్చితార్థం రద్దు చేసుకుందని యువతికి యాసిడ్ పోస్తానంటూ బెదిరింపులు
హైదరాబాద్: నిశ్చితార్థం రద్దు చేసుకుందన్న కక్షతో ఓ యువతిని యాసిడ్ పోసి చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్న యువకుడిపై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ వనస్థలిపురంలో నివసిస్తున్న 33 ఏళ్ల యువతి ఓ బీమా కంపెనీలో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తోంది. ఆమెకు డేటింగ్ యాప్ ద్వారా తిరుపతికి చెందిన అంబావారి వంశీ అనే యువకుడు పరిచయమయ్యాడు. పరిచయం క్రమంగా సన్నిహిత సంబంధంగా మారింది.
తాను రొమ్ము క్యాన్సర్‌కు విరుగుడు మందులను అభివృద్ధి చేసేందుకు అమెరికాలో సాఫ్ట్‌వేర్ కంపెనీ ఏర్పాటు చేయాలనుకుంటున్నానని, అందుకు డబ్బులు అవసరమని వంశీ యువతిని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన యువతి సుమారు రూ.15 లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇద్దరికీ నిశ్చితార్థం జరిగింది. అయితే ఆ తర్వాత కట్నం మొత్తాన్ని ముందుగానే చెల్లించాలని వంశీ యువతిని వేధించడం ప్రారంభించాడని సమాచారం. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పిన యువతి, వారి సూచనతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది.
నిశ్చితార్థం రద్దు కావడంతో వంశీ యువతిపై కక్ష పెంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె డ్రగ్స్‌కు బానిసైందంటూ, ఆమె తమ్ముడు ఉగ్రవాదులకు డబ్బులు సమకూరుస్తున్నాడంటూ యువతి పనిచేస్తున్న కార్యాలయానికి ఈమెయిల్స్ పంపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంతేకాకుండా, యువతి బయట కనిపిస్తే ఆమెపై యాసిడ్ పోస్తానని, లేదంటే చంపేస్తానని వంశీ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన యువతి బయటకు వెళ్లేందుకు కూడా భయపడుతూ ఇంటికే పరిమితమైనట్లు తెలిపింది.
జూన్‌లోనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ తనపై వేధింపులు ఆగలేదని యువతి వాపోయింది. ఇదిలా ఉండగా, ఈ నెల 4న యువతి తనను బెదిరిస్తోందంటూ వంశీ తిరుపతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు ఆధారంగా తిరుపతి పోలీసులు యువతిపై కేసు నమోదు చేశారు.
తన వాదన వినకుండానే తిరుపతి పోలీసులు తనపై కేసు నమోదు చేశారని ఆరోపిస్తూ యువతి ఈ నెల 5న వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించింది. తనను బెదిరిస్తూ, పరువు తీసేలా ఈమెయిల్స్ పంపుతూ వేధిస్తున్న వంశీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి, ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment