రూ.20 వేల లంచం తీసుకుంటూ సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ఏసీబీకి చిక్కారు
రూ.20 వేల లంచం తీసుకుంటూ సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ఏసీబీకి చిక్కారు
సంగారెడ్డి, సెప్టెంబర్ 9: లంచం తీసుకుంటూ సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి (DIEO) ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వికార్స్ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రొవిజనల్ అఫిలియేషన్ పునరుద్ధరణకు సంబంధించి తనిఖీ నిర్వహించి నివేదిక సమర్పించేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
ఏసీబీ వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రామ్‌అవత్ గోవింద్ రామ్ తన కార్యాలయంలో ఫిర్యాదుదారుడి నుంచి రూ.20,000 లంచం తీసుకుంటుండగా బుధవారం మధ్యాహ్నం సుమారు 1.20 గంటల సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
కళాశాల ప్రొవిజనల్ అఫిలియేషన్‌ను రెన్యూవల్ చేసేందుకు అవసరమైన తనిఖీ నిర్వహించి, అనుకూలంగా నివేదిక సమర్పించేందుకు అధికారి తొలుత రూ.50,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. ఇప్పటికే రూ.30,000 లంచం తీసుకున్న ఆయన, మిగిలిన రూ.20,000 కోసం డిమాండ్ చేయడంతో ఫిర్యాదుదారు ఏసీబీని ఆశ్రయించినట్లు తెలిపింది.
ఏసీబీ అధికారులు పథకం ప్రకారం నిర్వహించిన ట్రాప్‌లో రూ.20,000 లంచం స్వీకరిస్తుండగా గోవింద్ రామ్‌ను పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రజాసేవకుడిగా తన అధికారిక విధులను సక్రమంగా నిర్వహించకుండా అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.
నిందితుడిని అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని SPE & ACB కేసుల విచారణకు సంబంధించిన II అదనపు ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా ఆయన వివరాలను ఏసీబీ అధికారులు గోప్యంగా ఉంచారు.
లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫిర్యాదు చేయండి
ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు వెంటనే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఏసీబీని వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

Post a Comment