హైదరాబాద్ రెస్టారెంట్లలో బొద్దింకలు, ఎలుకలు 8 సంస్థల FSSAI లైసెన్సులు సస్పెండ్
హైదరాబాద్ రెస్టారెంట్లలో బొద్దింకలు, ఎలుకలు 8 సంస్థల FSSAI లైసెన్సులు సస్పెండ్
హైదరాబాద్: నగరంలోని పలు రెస్టారెంట్లలో ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. TG SAFEకు చెందిన 8 బృందాలు హైదరాబాద్‌లోని 15 రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించగా.. తీవ్ర అపరిశుభ్ర పరిస్థితులు వెలుగుచూశాయి.
తనిఖీల్లో పలు రెస్టారెంట్లలో బొద్దింకలు, ఈగలు, ఎలుకలు, ఎలుకల విసర్జితాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వంటగదులు, ఆహార నిల్వ ప్రాంతాల్లో పరిశుభ్రత లోపించడంతో పాటు గడువు ముగిసిన ఆహార పదార్థాలు, కుళ్లిన కూరగాయలు, అపరిశుభ్రమైన పాత్రలు, సరిగా నిర్వహించని డ్రైనేజీ వ్యవస్థలు అధికారుల దృష్టికి వచ్చాయి.
అదేవిధంగా ఆహార పదార్థాల స్టోరేజ్, లేబులింగ్‌లో నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు గుర్తించారు. కల్తీ లేదా నాణ్యతపై అనుమానాలు ఉన్న ఆహార పదార్థాలకు సంబంధించి మొత్తం 16 నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు.
8 సంస్థలపై చర్యలు
ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిబంధనలు ఉల్లంఘించిన 8 సంస్థల FSSAI ఫుడ్ లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు. వెంటనే వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరో 5 సంస్థలకు లోపాలను సరిదిద్దుకోవాలని ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
లక్కీ రెస్టారెంట్ మూసివేత
బాచుపల్లిలోని లక్కీ రెస్టారెంట్‌లో భారీగా బొద్దింకలు, తీవ్ర అపరిశుభ్ర పరిస్థితులు ఉన్నట్లు తనిఖీల్లో బయటపడింది. అంతేకాకుండా FSSAI లైసెన్స్ లేకుండానే రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో రెస్టారెంట్‌ను మూసివేశారు.
తనిఖీల సందర్భంగా గడువు ముగిసిన ఆహార పదార్థాలను అధికారులు గుర్తించి అక్కడికక్కడే పారవేశారు. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందేలా నిబంధనలు పాటించని ఆహార సంస్థలపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

Post a Comment