డీజే సౌండ్‌కు గుండెపోటు.. ఇంటర్ విద్యార్థి మృతి
డీజే సౌండ్‌కు గుండెపోటు.. ఇంటర్ విద్యార్థి మృతి
కోస్గి, సెప్టెంబర్ 3: పెళ్లి వేడుకలో డీజే సౌండ్‌కు డ్యాన్స్ చేస్తూ ఓ ఇంటర్ విద్యార్థి హఠాత్తుగా కుప్పకూలి మృతి చెందిన విషాద ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో పెళ్లి వేడుకలో విషాదఛాయలు అలుముకున్నాయి.
నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లికి చెందిన దస్తయ్య, లక్ష్మీ దంపతుల కుమారుడు రవితేజ (17) ఇంటర్ చదువుతున్నాడు. స్నేహితుడి ఇంట్లో పెళ్లి వేడుక ఉండటంతో బుధవారం రాత్రి అక్కడికి వెళ్లాడు. పెళ్లి సందడిలో భాగంగా డీజే సౌండ్‌కు స్నేహితులతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నాడు.
ఈ క్రమంలో రవితేజ ఒక్కసారిగా హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. దీంతో ఆందోళనకు గురైన స్నేహితులు, స్థానికులు వెంటనే అతడిని కోస్గి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే రవితేజను పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించినట్లు సమాచారం.
చిన్న వయసులోనే రవితేజ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. పెళ్లి వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్న యువకుడు కొద్దిసేపటికే విగతజీవిగా మారడంతో స్థానికంగా విషాదం నెలకొంది.
పెరుగుతున్న డీజే సంస్కృతిపై ఆందోళన
పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర వేడుకల్లో అధిక శబ్దంతో డీజేలు వినియోగించడం వల్ల ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్న ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. అధిక శబ్దంతో డీజేలు నిర్వహించవద్దని పోలీసులు పలుమార్లు హెచ్చరిస్తున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో డీజే సంస్కృతి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రవితేజ మృతి ఘటన మరోసారి అధిక శబ్దం, వేడుకల్లో భద్రతా చర్యలపై చర్చకు దారితీసింది.

Post a Comment