🕉️ గణేష్ మండపాలకు డీజేలు బంద్.. ఖమ్మం సీపీ సునీల్ దత్ కీలక సూచనలు
🕉️ గణేష్ మండపాలకు డీజేలు బంద్.. ఖమ్మం సీపీ సునీల్ దత్ కీలక సూచనలు
ఖమ్మం నగరంలో రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన నిబంధనలు ప్రకటించింది. గణేష్ మండపాల నిర్వాహకులతో సూర్య తేజ ఫంక్షన్ హాల్‌లో పోలీసు అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ.. మున్నేరు నదిలో ప్రస్తుతం నీటి లభ్యత తక్కువగా ఉన్నందున వినాయక విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యామ్నాయంగా ఖమ్మం అర్బన్ మండలంలోని దంసలాపురం గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తూరు చెరువు వద్ద ఏర్పాట్లు కొనసాగుతున్నాయని తెలిపారు. మట్టి విగ్రహాల ప్రతిష్ఠాపనకు నిర్వాహకులు సహకరించాలని కోరారు.
మండపాల నిర్వాహకులు policeportal.tspolice.gov.inలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకుని మండపం, నిర్వాహకుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.
🚫 డీజేలకు అనుమతి లేదు
గణేష్ మండపాల వద్ద DJలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. రెండు మైకులతో కూడిన స్పీకర్లను మాత్రమే ఉపయోగించాలని, అవి కూడా ప్రజలకు ఇబ్బంది కలగని స్థాయిలో ఉండాలని సూచించారు.
👮 మండపాల నిర్వాహకులకు ప్రధాన సూచనలు
- గణేష్ విగ్రహం ఏర్పాటు చేసే ముందు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- ప్రైవేట్ స్థలంలో మండపం ఏర్పాటు చేస్తే స్థల యజమాని నుంచి NOC/అభ్యంతరం లేదనే ధృవీకరణ తీసుకోవాలి.
- రహదారులు లేదా వివాదాస్పద స్థలాల్లో విగ్రహాలను ఏర్పాటు చేయకూడదు.
- ప్రధాన, ట్రాఫిక్ రద్దీ ఉన్న రహదారులపై మండపాలు ఏర్పాటు చేయరాదు.
- షార్ట్‌సర్క్యూట్‌లను నివారించేందుకు నాణ్యమైన విద్యుత్ తీగలు, పరికరాలను ఉపయోగించాలి.
- DJలకు అనుమతి లేదు; నిబంధనలకు అనుగుణంగా మైక్‌లు మాత్రమే ఉపయోగించాలి.
- మండపాల వద్ద అసభ్యకర కార్యక్రమాలకు తావివ్వకూడదు.
- ప్రతి మండపం వద్ద ఇద్దరు నిర్వాహకులు 24 గంటలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి.
- మండపం వద్ద నోటీసు బోర్డు, పాయింట్ బుక్ ఏర్పాటు చేసి నిర్వాహకుల ఫోన్ నంబర్లు పొందుపరచాలి.
- అగ్ని ప్రమాదాల నివారణకు ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు చేసి, తగినంత నీరు, ఇసుక అందుబాటులో ఉంచాలి.
అదేవిధంగా మండపాల వద్ద CCTV కెమెరాలు, సురక్షిత విద్యుత్ కనెక్షన్లు, అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయాలని పోలీసులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లే మార్గాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మూసివేయరాదని స్పష్టం చేశారు.
భక్తులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున రద్దీ నియంత్రణ, పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్వాహకులకు సూచించారు.
సమన్వయ సమావేశంలో ఏసీపీ రమణమూర్తి, ఎస్బీ ఏసీపీ మహేష్, ఇన్‌స్పెక్టర్లు కరుణాకర్, బాలకృష్ణ, మోహన్ బాబు, భానుప్రకాష్, ఉస్మాన్ షరీఫ్, సత్యనారాయణ, విద్యుత్ శాఖ డీఈ రామారావు, ఫైర్ అధికారి రామిరెడ్డి, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు వినోద్ లౌహిటి, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment