చిన్నారిపై ప్రైవేటు పాఠశాల హెచ్‌ఎం అత్యాచారయత్నం పోక్సో, ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు
చిన్నారిపై ప్రైవేటు పాఠశాల హెచ్‌ఎం అత్యాచారయత్నం పోక్సో, ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు
జగిత్యాల: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ప్రైవేటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో కలకలం రేపింది. ఘటనపై పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. ధర్మపురి మండలంలోని ఓ గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలిక స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతోంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చల్లా శ్రీనివాస్ బుధవారం బాలికను స్టాఫ్‌రూమ్‌లోకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. గురువారం తల్లిదండ్రులతో పాటు మరికొందరు కాలనీవాసులు పాఠశాలకు చేరుకుని హెచ్‌ఎంను నిలదీశారు. ఈ క్రమంలో పాఠశాలలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆగ్రహానికి గురైన కొందరు పాఠశాలలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పాఠశాలకు చేరుకున్నారు. డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, సీఐ రాంనర్సింహరెడ్డి ఘటనపై విచారణ చేపట్టారు. బాలిక కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించి, ఘటనకు సంబంధించిన పరిస్థితులను పరిశీలించారు.
అనంతరం నిందితుడు చల్లా శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక వాంగ్మూలం, కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
చిన్నారుల భద్రత విషయంలో పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి నిందితుడిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment