కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయి సాగు కలకలం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయి సాగు కలకలం
వ్యవసాయ భూమిలో అంతర పంటగా గంజాయి సాగు.. తండ్రీకొడుకుల అరెస్ట్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వ్యవసాయ భూమిలో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్న తండ్రీకొడుకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి పొలంలో సాగు చేస్తున్న 1,245 గంజాయి మొక్కలతో పాటు 11 గ్రాముల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.1.50 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.
విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టగా అంబురే పుండలిక్ వద్ద 11 గ్రాముల ఎండు గంజాయి లభించింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, తన కుమారుడు రమేశ్‌తో కలిసి వ్యవసాయ భూమిలో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం పోలీసులు వ్యవసాయ భూమిలో తనిఖీలు నిర్వహించి మొత్తం 1,245 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి తండ్రీకొడుకులను సోమవారం అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment