-->

మెదక్‌లో పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల పట్టాల పంపిణీ

 

మెదక్‌లో పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల పట్టాల పంపిణీ

మెదక్‌లో పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల పట్టాల పంపిణీ

మెదక్: మెదక్‌లోని శ్రీ వెంకటేశ్వర గార్డెన్స్‌లో పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు పాల్గొని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు మాట్లాడుతూ.. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ‘ఇందిరమ్మ రాజ్యం’లో పేదలకు ఇళ్లు అందిస్తున్నామని తెలిపారు.

ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం సన్నబియ్యం, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తోందని అన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని మాజీ సీఎం కేసీఆర్ కుమార్తెనే చెబుతున్నారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. గతంలో కొందరికి ఇళ్లు మంజూరు చేసిన సందర్భాల్లో కూడా డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయంగా ఇళ్లు అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమని రోహిత్‌రావు అన్నారు. గత పాలకులు ఆశలు కల్పిస్తూ, ప్రజలను మభ్యపెడుతూ పదేళ్లు గడిపారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతోందని, రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల పాలుచేసి దివాళా తీయించిందని ఆరోపించారు.

బీఆర్‌ఎస్‌ పాలనలో దళిత బంధు పథకం ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూర్చారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. తాము ప్రతిరోజూ ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటున్నామని తెలిపారు. ఏ గ్రామానికి వెళ్లినా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కనిపిస్తున్నాయని అన్నారు.

ఇళ్ల మంజూరు కోసం ఎవరూ ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దని ఎమ్మెల్యే సూచించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయంగా ఇళ్లు అందేలా తాము పనిచేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ తప్పిదాలను తమ ప్రభుత్వంపై మోపితే చూస్తూ ఊరుకోబోమని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు హెచ్చరించారు.

Blogger ఆధారితం.