సింగరేణి మెడికల్ బోర్డులో కార్మికులకు అన్యాయం అరికట్టాలి టీబీజీకేఎస్
సింగరేణి మెడికల్ బోర్డులో కార్మికులకు అన్యాయం అరికట్టాలి
నల్ల బ్యాడ్జీలతో టీబీజీకేఎస్ నిరసన.. అధికారులకు వినతిపత్రాల అందజేత
కొత్తగూడెం, సెప్టెంబర్ 1: సింగరేణి మెడికల్ బోర్డులో కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ తెలంగాణ బొగ్గు గనికార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఆధ్వర్యంలో మంగళవారం సింగరేణి వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. టీబీజీకేఎస్ కార్పొరేట్ ఏరియా ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్లలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం సంబంధిత అధికారులకు పిట్ సెక్రటరీల ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా టీబీజీకేఎస్ కార్పొరేట్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ తుమ్మ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన సింగరేణి కార్మికులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతినెలా క్రమం తప్పకుండా మూడు మెడికల్ బోర్డులను నిర్వహించి, అనారోగ్యంతో బాధపడుతున్న అర్హులైన కార్మికులందరినీ నిబంధనల ప్రకారం మెడికల్ అన్ఫిట్‌గా ప్రకటించాలని కోరారు.
మెడికల్ బోర్డు నిర్వహణలో జాప్యం కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అర్హత ఉన్న కార్మికులకు మెడికల్ అన్ఫిట్ సర్టిఫికెట్లు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను కోరారు.
టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి, చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపు కృష్ణ ఇచ్చిన పిలుపు మేరకు సెప్టెంబర్ 1న కార్పొరేట్ ఏరియాలోని అన్ని విభాగాల్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు నాయకులు తెలిపారు.
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్ నిరంతరం పోరాటం చేస్తుందని, మెడికల్ బోర్డు విషయంలో కార్మికులకు న్యాయం జరిగే వరకు తమ ఆందోళనలను కొనసాగిస్తామని టీబీజీకేఎస్ నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో తుమ్మ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సెంటర్ కమిటీ సభ్యులు కంచర్ల శ్రీనివాస్, ప్రసాద్, బ్రాంచ్ కమిటీ సభ్యులు రవివర్మ, పిట్ సెక్రటరీ సూర్యనారాయణ, అసిస్టెంట్ సెక్రటరీ అమరేందర్తో పాటు టీబీజీకేఎస్ కుటుంబ సభ్యులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Post a Comment