-->

సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలతో సమానంగా చర్చలు జరుపాలి హెచ్ఎంఎస్

 

సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలతో సమానంగా చర్చలు జరుపాలి హెచ్ఎంఎస్

సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలతో సమానంగా చర్చలు జరుపాలి హెచ్ఎంఎస్

భూపాలపల్లి: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘాల కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో ఇకపై సింగరేణి యాజమాన్యం అన్ని రిజిస్టర్‌డ్ కార్మిక సంఘాలతో సమానంగా చర్చలు జరపాలని హెచ్ఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

శనివారం భూపాలపల్లి ఏరియాలోని KTK-6 గని వద్ద హెచ్ఎంఎస్ భూపాలపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ నరేష్ నేత అధ్యక్షతన ఉదయం గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ, జేబీసీసీఐ సభ్యులు రియాజ్ అహ్మద్, హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.

గత ఏడాది డిసెంబర్ 27తో గుర్తింపు కార్మిక సంఘాల కాలపరిమితి ముగిసినప్పటికీ, మరో ఆరు నెలల పాటు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలు అనధికారికంగా అధికారాన్ని కొనసాగించాయని నాయకులు ఆరోపించారు. ఇకపై సేఫ్టీ కమిటీ, ఫిట్ కమిటీ తదితర అధికారిక కమిటీల్లో ఆయా సంఘాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వకుండా సింగరేణిలోని అన్ని రిజిస్టర్‌డ్ కార్మిక సంఘాలకు సమాన హోదా కల్పించాలని కోరారు.

ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలను అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరించారు. గత 30 నెలల్లో కార్మికుల సమస్యలు పరిష్కరించలేకపోయిన సంఘాలు.. సమ్మె కారణంగా యాజమాన్యం దిగివచ్చిందని, చారిత్రక ఒప్పందాలు సాధించామని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.

సింగరేణిలో విడి పరికరాలు, కోల్ బిట్లు, లైన్‌మెన్ కీలలు, టోపీలు, బూట్లు, రక్షణ పరికరాలు, చేతి తొడుగుల కొరతతో పాటు గాలి, తాగునీటి సమస్యలు ఉన్నాయని నాయకులు పేర్కొన్నారు. సస్పెన్షన్లు, ఛార్జ్‌షీట్లు, పెండింగ్ ఎంక్వైరీలు, డిస్మిసల్స్, సంవత్సరానికి ఒకసారి PME నిబంధన వంటి అనేక సమస్యలతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్యలు పరిష్కరించామని చెప్పే ప్రచారాలను కార్మికులు నమ్మవద్దని సూచించారు.

కార్మికుల హక్కుల కోసం నిస్వార్థంగా పోరాడుతున్న హెచ్ఎంఎస్ యూనియన్‌కు ఈసారి మద్దతు ఇవ్వాలని కార్మికులను నాయకులు కోరారు.

మంజూరు నగర్ ఏరియా ఆస్పత్రిలో సమస్యలపై పరిశీలన

అనంతరం బ్రాంచ్ నాయకులు సాగర్ ఆధ్వర్యంలో మంజూరు నగర్ ఏరియా ఆస్పత్రిని హెచ్ఎంఎస్ నాయకులు సందర్శించారు. నర్సింగ్ సిబ్బంది, కార్మికులతో మాట్లాడగా పలు సమస్యలు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు.

రిఫరల్ విధానంలో అధికారులు, నాయకులకు ఒక విధంగా, సాధారణ కార్మికులకు మరో విధంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయని, అందరికీ సమానంగా మెరుగైన వైద్యం, మందులు, చికిత్స అందించాలని హెచ్ఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

ఆస్పత్రి ఫార్మసీలో కార్మికులకు అవసరమైన మందులు అందించడంలో జాప్యం జరుగుతోందని, రిటైర్డ్ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. కనీసం హ్యాండ్‌వాష్‌లు కూడా సక్రమంగా అందుబాటులో లేకపోవడం, చికిత్సకు సంబంధించి పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిబ్బంది తెలిపినట్లు నాయకులు పేర్కొన్నారు.

ఇలాంటి సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్ఎంఎస్ నాయకులు హెచ్చరించారు.

అలాగే కంపెనీకి అదనపు భారం లేకుండా నర్సింగ్ స్టాఫ్ పేరును నర్సింగ్ ఆఫీసర్గా మార్చాలని సిబ్బంది కోరినట్లు తెలిపారు. వార్డ్ అసిస్టెంట్ల గ్రేడ్ మార్పు, పారామెడికల్ సిబ్బందికి డ్రెస్ క్లాత్ అందించడం, డ్రెస్ మార్చుకునేందుకు ప్రత్యేక గది ఏర్పాటు, సిబ్బందికి క్యాంటీన్ సౌకర్యం కల్పించడం వంటి సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో భూపాలపల్లి బ్రాంచ్ కార్యదర్శి మల్లేష్, సహాయ కార్యదర్శి నరసయ్య, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మహంకాళి తిరుపతి, చంద్రశేఖర్, అవినాష్, చుక్క రాజు, హరికృష్ణ, రాజుకుమార్, సిరాజ్, శివకృష్ణ, టీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్ధిక్, వినోద్ గౌడ్, గోవర్ధన్, విఘ్నేష్, సన్నీతో పాటు కార్మికులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు.

Blogger ఆధారితం.