వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
రూ.10 లక్షల నగదు స్వాధీనం.. రోజుకు రూ.20 లక్షల మేర లావాదేవీలు జరిగినట్లు గుర్తింపు
హైదరాబాద్: నగర శివారులోని వట్టినాగులపల్లిలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై గచ్చిబౌలి పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 27 మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి సుమారు రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో ఉన్న 'ది స్కై బై విహారా ఫామ్'లో అందర్ బహార్ పేకాట నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం దాడి చేపట్టింది. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 27 మంది పోలీసులకు పట్టుబడ్డారు.
ప్రాథమిక విచారణలో చిన్న యాదవ్ (బీఎన్ రెడ్డినగర్), సోను (సన్‌సిటీ), నవీన్ అనే వ్యక్తులు గత నాలుగు నెలలుగా ఈ పేకాట స్థావరాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడైనట్లు సమాచారం. ఇక్కడ ప్రతిరోజూ సుమారు రూ.20 లక్షల మేర పేకాట లావాదేవీలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.
దాడిలో రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ చేపట్టారు. పేకాట నిర్వహణ వెనుక ఉన్నవారితో పాటు ఇతర బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Post a Comment