సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవానికి బతుకమ్మ ప్రతీక: ముఖ్యమంత్రి
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా, ప్రకృతి ప్రేమకు ప్రతిరూపంగా, మహిళల ఐక్యతకు నిదర్శనంగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
తొమ్మిది రోజుల పాటు ప్రకృతి ఒడిలో విరబూసే రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, గౌరమ్మను భక్తిశ్రద్ధలతో పూజిస్తూ, ఆటపాటలతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పూల పండుగ తెలంగాణ ప్రజల జీవనశైలికి, సాంస్కృతిక వైభవానికి అద్దం పడుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
బతుకమ్మ కేవలం పూల పండుగ మాత్రమే కాదని, ప్రకృతిని ఆరాధించే సంప్రదాయానికి, మహిళల ఐక్యతకు, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతీక అని తెలిపారు. తరతరాలుగా పూర్వీకులు అందించిన ఈ అపురూపమైన సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.
ఈ సద్దుల బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా సంతోషాల పూలు పూయించాలని, ప్రతి కుటుంబంలో సిరిసంపదలు, సుఖశాంతులు వెల్లివిరియాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. తెలంగాణ ఆడపడుచుల జీవితాల్లో ఆనందం, ఆత్మవిశ్వాసం నిండాలని, రాష్ట్ర సంస్కృతి వైభవం దశదిశలా విరాజిల్లాలని అభిలషించారు.
మన సంప్రదాయాల పరిమళం తరతరాల పాటు విస్తరించాలని, బతుకమ్మ పండుగ ప్రజల జీవితాల్లో సంతోషాన్ని, ఐక్యతను నింపాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

Post a Comment