కొత్తగూడెం సబ్ డివిజన్లో ఏకకాలంలో నాకాబందీ తనిఖీలు
కొత్తగూడెం సబ్ డివిజన్లో ఏకకాలంలో నాకాబందీ తనిఖీలు
అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పోలీసుల ప్రత్యేక చర్యలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు ప్రత్యేక నాకాబందీ తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ తనిఖీలను ఏకకాలంలో చేపట్టారు.
ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం వన్ టౌన్ పరిధిలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్, టూ టౌన్ పరిధిలోని రామవరం మెయిన్ రోడ్, త్రీ టౌన్ పరిధిలోని పాత డిపో వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అదేవిధంగా లక్ష్మీదేవిపల్లి పరిధిలోని ఇల్లందు క్రాస్ రోడ్, చుంచుపల్లి బైపాస్, సుజాతనగర్ మెయిన్ రోడ్ సెంటర్లతో పాటు జూలూరుపాడు పరిధిలోని మాచినేనిపేట క్రాస్ రోడ్, చంద్రుగొండ సెంటర్, అన్నపురెడ్డిపల్లి శివాలయం వద్ద ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాయి.
మత్తు పదార్థాల అక్రమ రవాణాపై నిఘా
నాకాబందీ తనిఖీల్లో భాగంగా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టడం, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించడం, ట్రాఫిక్ నిబంధనల అమలును పర్యవేక్షించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా డీఎస్పీ ఆదినారాయణ మాట్లాడుతూ.. సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు పోలీసులు నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తున్నారని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం ఇవ్వండి
ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం గుర్తించినట్లయితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
ప్రజల సహకారంతో నేరాలను నియంత్రించి, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు పోలీసు శాఖ కట్టుబడి ఉందని అధికారులు పేర్కొన్నారు.

Post a Comment