విద్యార్థుల అభ్యసనకు అనుకూల వాతావరణం కల్పించాలి: కలెక్టర్ అంకిత్
విద్యార్థుల అభ్యసనకు అనుకూల వాతావరణం కల్పించాలి: కలెక్టర్ అంకిత్
జూలూరుపాడు, అక్టోబర్ 5: విద్యార్థుల అభ్యసనకు అనుకూలమైన వాతావరణాన్ని పాఠశాలల్లో కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలు, ఆరోగ్యం, పోషకాహారంపై ఉపాధ్యాయులు నిరంతరం దృష్టి సారించాలని ఆయన అన్నారు.
జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలను కలెక్టర్ అంకిత్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యాబోధన, ఎస్ఏ–1 పరీక్షల నిర్వహణ, విద్యార్థుల హాజరు, మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజనం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పాఠశాలలో జరుగుతున్న ఎస్ఏ–1 పరీక్షలను పరిశీలించిన కలెక్టర్, వివిధ తరగతుల విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును గమనించారు. విద్యార్థులు రాస్తున్న ప్రశ్నపత్రాలను పరిశీలించి, వారి అభ్యసన స్థాయి గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
పాఠశాలలో మొత్తం 73 మంది విద్యార్థులు ఉండగా, సోమవారం 62 మంది హాజరైనట్లు ఉపాధ్యాయులు కలెక్టర్‌కు వివరించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరుకాని విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు సమన్వయం చేసుకొని, పిల్లలు పాఠశాలకు వచ్చేలా చూడాలని సూచించారు.
అనంతరం పాఠశాలలోని మౌలిక సదుపాయాలను పరిశీలించిన కలెక్టర్.. ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమం కింద చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను తెలుసుకున్నారు. చేపట్టిన పనుల ప్రస్తుత పరిస్థితి, వాటి ద్వారా విద్యార్థులకు కలుగుతున్న ప్రయోజనాలపై ఉపాధ్యాయులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ప్రీ-ప్రైమరీ చిన్నారులపై ప్రత్యేక దృష్టి
పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న ప్రీ-ప్రైమరీ తరగతులను కూడా కలెక్టర్ సందర్శించారు. అక్కడ 14 మంది చిన్నారులు విద్యనభ్యసిస్తున్నట్లు తెలుసుకున్నారు. చిన్నారులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించడంతో పాటు, వారికి నూతనంగా అందించనున్న ఏకరూప దుస్తులను పరిశీలించారు.
చిన్నారుల వయస్సుకు అనుగుణంగా విద్యాబోధన జరుగుతున్న తీరును, అభ్యసన వాతావరణాన్ని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఆటలు, బొమ్మలు, ఇతర అభ్యసన సామగ్రిని వినియోగిస్తూ పిల్లలు ఉల్లాసంగా నేర్చుకునేలా చూడాలని సూచించారు. తరగతి గదుల్లో చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని తెలిపారు.
నాణ్యమైన పోషకాహారం అందించాలి
విద్యార్థులకు అందిస్తున్న పోషకాహారంపై కూడా కలెక్టర్ ఆరా తీశారు. ఉదయం 11 గంటలకు రాగిజావ, అనంతరం మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు ఉపాధ్యాయులు వివరించారు. మధ్యాహ్న భోజన పథకం కింద అమలు చేస్తున్న మెనూ, ఆహార పదార్థాల నాణ్యత, వంటశాల పరిశుభ్రత తదితర అంశాలను వంట నిర్వాహకురాలిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన, పోషక విలువలతో కూడిన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి విద్య, ఆరోగ్యం, పోషకాహారం, హాజరు వంటి అంశాలపై నిరంతర పర్యవేక్షణ అవసరమని కలెక్టర్ అంకిత్ తెలిపారు. ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని అందించాలని సూచించారు. ఈ తనిఖీలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంఈఓ జుంకీలాల్, సంబంధిత శాఖల అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment