రూ.4 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్
రూ.8 లక్షల లంచం డిమాండ్.. రూ.4 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) గోల్కొండ జోన్, సర్కిల్-33, మెహిదీపట్నం కార్యాలయంలో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ తులసీరాం సునీత అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు.
అధికారిక సమాచారం ప్రకారం.. ఓ భవన నిర్మాణానికి సంబంధించి అధికారికంగా అనుకూలంగా వ్యవహరించేందుకు సునీత రూ.8 లక్షల లంచాన్ని డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. అందులో భాగంగా రూ.4 లక్షలను స్వీకరిస్తుండగా 2026 అక్టోబర్ 5న సిటీ రేంజ్-1 ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఫిర్యాదుదారుడికి అనుకూలంగా వ్యవహరించి, GHMC డిప్యూటీ కమిషనర్ జారీ చేసిన స్పీకింగ్ ఆర్డర్లను పట్టించుకోకుండా భవన నిర్మాణ పనులు కొనసాగించేందుకు అనుమతించడం, ఇకపై ఇబ్బందులకు గురిచేయకుండా ఉండటం, భవిష్యత్తులో సహకరించడం వంటి అధికారిక పనుల కోసం లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ పేర్కొంది.
టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ వద్ద నుంచి లంచంగా స్వీకరించిన రూ.4 లక్షలు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా లెక్కల్లో చూపని రూ.2.50 లక్షల నగదును కూడా ఆమె వద్ద గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అధికార దుర్వినియోగానికి పాల్పడి, అనుచిత ప్రయోజనం పొందేందుకు విధులను సక్రమంగా నిర్వహించలేదని ఏసీబీ పేర్కొంది. అనంతరం నిందిత అధికారిణిని నాంపల్లిలోని SPE & ACB కేసుల కోసం ఏర్పాటు చేసిన I అదనపు ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి, న్యాయ రిమాండ్‌కు తరలించేందుకు చర్యలు చేపట్టారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా ఆయన వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించలేదు.
లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయండి
ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ACB టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఏసీబీ తెలంగాణను వాట్సాప్ ద్వారా 9440446106 నంబర్‌లో, అలాగే సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారు/బాధితుడి పేరు, వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ స్పష్టం చేసింది.

Post a Comment