ఒకే యువతికి ఇద్దరు భర్తలు.. పెళ్లి పేరుతో రూ.15 లక్షల మోసం!

 

దీపావళికి భార్య ఇంటికి రాకపోవడంతో అనుమానం.. ఆమె ఇంటికి వెళ్లిన ఇద్దరు భర్తలకు షాక్!

ఒకే యువతికి ఇద్దరు భర్తలు.. పెళ్లి పేరుతో రూ.15 లక్షల మోసం!

**దీపావళికి భార్య ఇంటికి రాకపోవడంతో అనుమానం.. ఆమె ఇంటికి వెళ్లిన ఇద్దరు భర్తలకు షాక్!**

**తమిళనాడు:** పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ యువతి వ్యవహారం తమిళనాడులో కలకలం రేపింది. ఒకే యువతి ఇద్దరు వ్యక్తులను వివాహం చేసుకుని, పెళ్లి ఖర్చుల పేరుతో సుమారు రూ.15 లక్షలు మోసం చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దీపావళి పండుగకు కూడా భార్య ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన మొదటి భర్త ఆమె ఇంటికి వెళ్లగా అసలు విషయం బయటపడింది.

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టికి చెందిన 23 ఏళ్ల కార్తికకు, తంజావూరుకు చెందిన 36 ఏళ్ల సిద్ధార్థన్‌తో సెప్టెంబర్ 13న ఘనంగా వివాహం జరిగింది. ఈ వివాహం కోసం మధ్యవర్తులకు రూ.3 లక్షలు చెల్లించడంతో పాటు, వధువుకు మూడు సవర్ల బంగారు ఆభరణాలు ఇచ్చినట్లు సిద్ధార్థన్ కుటుంబ సభ్యులు తెలిపారు. మొత్తం మీద పెళ్లికి సుమారు రూ.15 లక్షలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.

అయితే పెళ్లయిన రెండో రోజే తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని చెప్పిన కార్తిక కోవిల్‌పట్టికి వెళ్లిపోయింది. ఆ తర్వాత భర్త ఇంటికి తిరిగి రాలేదు. దీపావళి పండుగకు కూడా భార్య రాకపోవడంతో సిద్ధార్థన్‌కు అనుమానం వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ కార్తిక కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయారు.

ఇంతలో నామక్కల్‌కు చెందిన 37 ఏళ్ల రంజిత్‌కుమార్ కూడా అక్కడికి చేరుకున్నాడు. నవంబర్ 1న కోవిల్‌పట్టిలోని ఓ ఆలయంలో తాను కార్తికను వివాహం చేసుకున్నానని, ఆమె కోసం వెతుకుతున్నానని చెప్పాడు. దీంతో అక్కడికి వచ్చిన సిద్ధార్థన్ కుటుంబ సభ్యులకు మరో షాక్ తగిలింది. ఒకే యువతిని ఇద్దరూ వివాహం చేసుకున్న విషయం బయటపడింది.

కార్తిక తల్లిదండ్రులమని చెప్పుకున్న మునీశ్వరి, మారియప్పన్‌లను ఇద్దరు భర్తలు ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. మొదట తాను మధ్యవర్తినని చెప్పిన మారియప్పన్, ఆ తర్వాత మునీశ్వరి భర్తనని చెప్పుకున్నాడు. కార్తిక తన బామ్మను చూడటానికి తూత్తుకుడి ఆసుపత్రికి వెళ్లిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

దీంతో తాము మోసపోయామని భావించిన సిద్ధార్థన్, రంజిత్‌కుమార్‌లు కోవిల్‌పట్టి వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా కార్తిక, మారియప్పన్, మునీశ్వరి ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురు ఇదే తరహాలో మరికొందరిని కూడా పెళ్లి పేరుతో మోసం చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Blogger ఆధారితం.