కొత్తగూడెంలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్.. 200 ఇళ్లలో తనిఖీలు!

 

రూ.25,460 జరిమానా వసూలు.. 3 వాహనాలు సీజ్.. అక్రమ మద్యంపై 4 కేసులు నమోదు

కొత్తగూడెంలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్.. 200 ఇళ్లలో తనిఖీలు!

రూ.25,460 జరిమానా వసూలు.. 3 వాహనాలు సీజ్.. అక్రమ మద్యంపై 4 కేసులు నమోదు

**కొత్తగూడెం:** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజామున కొత్తగూడెం రామా టాకీస్ ప్రాంతం, నెహ్రూ బస్తీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ నేతృత్వంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

ఈ ఆపరేషన్‌లో పోలీసులు సుమారు 200 ఇళ్లను తనిఖీ చేయడంతో పాటు 82 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలను పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 21 వాహనాలపై జరిమానాలు విధించారు. మొత్తం 151 చలాన్ల ద్వారా రూ.25,460 జరిమానా వసూలు చేశారు. సరైన పత్రాలు లేని మూడు వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్రమ మద్యం (IMFL)కు సంబంధించి నాలుగు కేసులు నమోదు చేశారు.

ఈ సందర్భంగా డీఎస్పీ ఆదినారాయణ మాట్లాడుతూ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ కోసం ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. యువత గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి వినియోగం ఆరోగ్యం, కుటుంబ జీవితం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. మూఢనమ్మకాలను నమ్మి మోసపోవద్దని సూచించారు.

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాలకు అవసరమైన ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు.

అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, నకిలీ లింకులు, ఆన్‌లైన్ పెట్టుబడి మోసాలు, ఓటీపీ మోసాల బారిన పడవద్దని హెచ్చరించారు. బ్యాంకు వివరాలు, ఓటీపీలను ఇతరులతో పంచుకోవద్దని సూచించారు.

నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపునకు ఇళ్ల వద్ద, కాలనీల్లోని ప్రధాన కూడళ్లు, రహదారుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు శ్రీలక్ష్మి, వెంకటేశ్వర్లు, ఇంద్రసేనారెడ్డి, జితేందర్, ఎస్సైలు, కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసు సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.


Blogger ఆధారితం.