మండీ బిర్యానీ తిని 9 మందికి ఫుడ్ పాయిజనింగ్.. ఐదుగురు చిన్నారులు!
మండీ బిర్యానీ తిని 9 మందికి ఫుడ్ పాయిజనింగ్.. ఐదుగురు చిన్నారులు!
హైదరాబాద్ అంబర్‌పేటలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన కలకలం రేపింది. ఓ హోటల్లో మండీ బిర్యానీ తిన్న ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఐదుగురు చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. అంబర్‌పేటకు చెందిన ఓ కుటుంబం ఈ నెల 15న గాంధీ బొమ్మ సమీపంలోని ఓ బిర్యానీ హోటల్ నుంచి మండీ బిర్యానీ తెప్పించుకుని బంధువులతో కలిసి తిన్నారు. కొద్దిసేపటికే తొమ్మిది మందికి వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి.
దీంతో బాధితులు హోటల్ యజమానిని నిలదీయగా, వారికి స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయితే బాధితుల్లో ఓ మహిళకు న్యూరో సమస్య తలెత్తడంతో పరిస్థితి విషమించింది.
దీంతో మెరుగైన వైద్యం కోసం బుధవారం బాధితులందరినీ నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే ఏడేళ్లలోపు చిన్నారులకు ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స అందించకపోవడంతో పాటు, ఓ మహిళకు న్యూరో సమస్య ఉన్నట్లు ప్రైవేట్ ఆసుపత్రి రిపోర్టులో పేర్కొనడంతో బాధితులందరినీ ఉస్మానియా ఆసుపత్రికి రెఫర్ చేశారు.
ఫుడ్ పాయిజనింగ్‌కు గురైన వారిలో సయ్యద్ నసీమ్ సుల్తానా, ఖతీజ తుల్ కుబ్రా, ఆస్మా సుల్తానా, కాచిగూడ నెహ్రూనగర్‌కు చెందిన మహ్మద్ ఆమీర్ తదితరులు ఉన్నారు.
ఒకే హోటల్లో ఆహారం తిన్న తొమ్మిది మంది అస్వస్థతకు గురికావడంతో ఆహార భద్రత అధికారుల తనిఖీలు, హోటల్ ఆహార నాణ్యతపై విచారణ అవసరమనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Post a Comment