కామారెడ్డిలో ముసుగు దొంగల బీభత్సం.. తాళం వేసిన ఇళ్లే టార్గెట్!

కామారెడ్డిలో ముసుగు దొంగల బీభత్సం.. తాళం వేసిన ఇళ్లే టార్గెట్!


కామారెడ్డిలో ముసుగు దొంగల బీభత్సం.. తాళం వేసిన ఇళ్లే టార్గెట్!

కామారెడ్డి పట్టణంలో ముసుగు దొంగలు మరోసారి కలకలం సృష్టించారు. అర్ధరాత్రి వేళ మారణాయుధాలతో కాలనీల్లో సంచరిస్తూ, తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. ఈ ఘటనలతో పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

జిల్లా కేంద్రం శివారులోని దేవీవిహార్ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌లో తాళం వేసి ఉన్న ఇంటిని దొంగలు టార్గెట్ చేశారు. ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు రూ.25 వేల నగదును అపహరించినట్లు సమాచారం. ముఖాలకు ముసుగులు ధరించి, బ్యాగులతో వచ్చిన దొంగలు చోరీ అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ చోరీ దృశ్యాలు అపార్ట్‌మెంట్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరో ఇంట్లోనూ నగదు చోరీ జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కాగా, కొన్ని నెలల క్రితం కూడా ఇదే తరహాలో ముసుగు దొంగల ముఠా కామారెడ్డి పట్టణంలో చోరీలకు పాల్పడినట్లు సమాచారం. తాజాగా మళ్లీ అదే తరహా దొంగలు కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దొంగలు మారణాయుధాలతో సంచరిస్తున్నారనే సమాచారంతో భయాందోళనలు మరింత పెరిగాయి.

ఈ ముఠా బీహార్‌కు చెందినదై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు. రాత్రి వేళల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.


Blogger ఆధారితం.