కరోనా సమయంలో డిస్మిస్ అయిన సింగరేణి కార్మికులకు మరో అవకాశం కల్పించాలి!

కటాఫ్ తేదీలతో సంబంధం లేకుండా వన్‌టైమ్ ఛాన్స్ ఇవ్వాలి.. వందలాది కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి


 కరోనా సమయంలో డిస్మిస్ అయిన సింగరేణి కార్మికులకు మరో అవకాశం కల్పించాలి!

**కటాఫ్ తేదీలతో సంబంధం లేకుండా వన్‌టైమ్ ఛాన్స్ ఇవ్వాలి.. వందలాది కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి**

కరోనా మహమ్మారి సమయంలో ఉద్యోగాలు కోల్పోయి నేడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సింగరేణి కార్మిక కుటుంబాలకు మరో అవకాశం కల్పించాలని బాధిత కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు. 2023 నుంచి 2025 మధ్య వివిధ కారణాలతో డిస్మిస్ అయిన కార్మికులకు సింగరేణి యాజమాన్యం వన్‌టైమ్ అవకాశం కల్పించడం పట్ల హర్షం వ్యక్తమవుతున్నప్పటికీ, కరోనా కాలంలో ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులను కూడా ఈ అవకాశం పరిధిలోకి తీసుకురావాలని కోరుతున్నారు.

కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ప్రాణభయం, అనారోగ్య సమస్యలు, లాక్‌డౌన్ ఆంక్షలు, ఇతర అనివార్య పరిస్థితుల కారణంగా విధులకు హాజరుకాలేక పలువురు కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వారిపై మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

**కూలీ పనులకు వెళ్తున్న మాజీ సింగరేణి కార్మికులు**

ఒకప్పుడు సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తూ కుటుంబాలను పోషించిన కార్మికులు, నేడు జీవనోపాధి కోసం రోజువారీ కూలీ పనులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పోషణ భారంగా మారడంతో పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయని, అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులకు మందులు కొనలేని దుస్థితి నెలకొందని చెబుతున్నారు. తమతో పాటు పనిచేసిన తోటి కార్మికులకు తిరిగి ఉద్యోగ అవకాశం లభిస్తుండగా, కేవలం కటాఫ్ తేదీల కారణంగా తమకు అవకాశం దక్కకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

**ప్రభుత్వానికి, సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి**

తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం ఈ సమస్యపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని బాధిత కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు. కరోనా సమయంలోనే కాకుండా అంతకుముందు వివిధ అనివార్య కారణాలతో డిస్మిస్ అయిన అర్హులైన కార్మికులందరి కేసులను మానవతా దృక్పథంతో పరిశీలించాలని కోరుతున్నారు.

ఎలాంటి కటాఫ్ తేదీ ఆంక్షలు లేకుండా, అర్హతలు మరియు నిబంధనలకు అనుగుణంగా ఒక్కసారి వన్‌టైమ్ రీ-ఎంప్లాయ్‌మెంట్ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. యాజమాన్యం తీసుకునే ఒక్క సానుకూల నిర్ణయం వందలాది కార్మిక కుటుంబాలకు తిరిగి జీవనాధారాన్ని అందించడమే కాకుండా, వారి పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుందని బాధితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Blogger ఆధారితం.