కోకాపేటలో పద్మశాలి ఆత్మగౌరవ భవనానికి రెండెకరాల భూమి
కోకాపేటలో పద్మశాలి ఆత్మగౌరవ భవనానికి రెండెకరాల భూమి.. రూ.5 కోట్ల నిధులు మంజూరు!
హైదరాబాద్: పద్మశాలి సామాజిక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని కోకాపేటలో పద్మశాలి ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భవన నిర్మాణ పనుల కోసం రూ.5 కోట్ల నిధులను కూడా మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెం.24 విడుదల చేసింది.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట గ్రామ పరిధిలో ఈ భూమిని కేటాయించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రొసీడింగ్స్ పత్రాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు సచివాలయంలో పద్మశాలి సంఘం ప్రతినిధులకు అందజేశారు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ బీసీ సామాజిక వర్గాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన రూ.88.50 కోట్ల నిధుల్లో భాగంగా పద్మశాలి సంఘానికి ఈ నిధులు మంజూరయ్యాయి. కోకాపేట వంటి కీలక ప్రాంతంలో రెండు ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని కేటాయించడం పద్మశాలి సామాజిక వర్గానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ మల్టీపర్పస్ ఆత్మగౌరవ భవనం పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన చేనేత కార్మికులు, యువత, విద్యార్థులు, మహిళలకు ఎంతగానో ఉపయోగపడనుంది. సామాజిక, విద్యా, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఈ భవనం వేదికగా నిలవనుంది.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఆత్మగౌరవ భవన డిమాండ్‌ను నెరవేర్చడంతో పద్మశాలి మహాసభ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. భూమి కేటాయింపుతో పాటు నిర్మాణానికి రూ.5 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
పద్మశాలి సామాజిక వర్గ అభ్యున్నతికి, ఐక్యతకు, భవిష్యత్ తరాల విద్యా, సాంస్కృతిక వికాసానికి ఈ ఆత్మగౌరవ భవనం కేంద్రంగా నిలుస్తుందని సంఘం ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Post a Comment