రెండేళ్ల ప్రేమ.. పెళ్లికి నిరాకరణ.. ప్రియుడి ఇంటి ముందు యువతి నిరాహార దీక్ష!
రెండేళ్ల ప్రేమ.. పెళ్లికి నిరాకరణ.. ప్రియుడి ఇంటి ముందు యువతి నిరాహార దీక్ష!
మంచిర్యాల జిల్లా: రెండేళ్లుగా ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు వివాహానికి నిరాకరిస్తున్నాడని ఆరోపిస్తూ ఓ యువతి నిరాహార దీక్షకు దిగింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
బెల్లంపల్లి మండలం అంకుశం గ్రామానికి చెందిన ఎల్లమధ్రి అనిత (24), దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన పాల్తే గౌతమ్ (27) గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు యువతి తెలిపింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ సంబంధం కొనసాగిందని, అయితే ప్రస్తుతం తనను వివాహం చేసుకోవడానికి గౌతమ్ నిరాకరిస్తున్నాడని అనిత ఆరోపిస్తోంది.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు మాట మార్చడంతో తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో లింగాపూర్ గ్రామంలోని గౌతమ్ ఇంటి ముందు అనిత నిరాహార దీక్ష చేపట్టింది.
కులాంతర ప్రేమ వ్యవహారంలో న్యాయం కోసం పోరాటం
తాను ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన యువతినని, గౌతమ్ లంబాడీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని అనిత పేర్కొంది. కులాలతో సంబంధం లేకుండా తమ ప్రేమ వ్యవహారంపై అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతోంది.
పోలీసులు, సంబంధిత అధికారులు ఇరువర్గాల వాదనలు విని సమగ్ర విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. తన సమస్యకు న్యాయబద్ధమైన పరిష్కారం లభించే వరకు పోరాటం కొనసాగిస్తానని అనిత స్పష్టం చేసింది.
యువతి చేపట్టిన నిరాహార దీక్షతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Post a Comment