-->

వైద్య ఆరోగ్యశాఖలో పెత్తనమంతా మోహన మాయాజాలం

వైద్య ఆరోగ్యశాఖలో పెత్తనమంతా మోహన మాయాజాలం


*ఖమ్మం* వైద్య, ఆరోగ్య శాఖలో ఫార్మసిస్ట్ మోహన్ పెత్తనం అంతా ఇంతా కాదన్నట్లుగా సాగుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలకు బదిలీలు, పోస్టింగులపై సదరు ఉద్యోగి అభయహస్తం ఇస్తు్న్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పలు జిల్లాల డీఎంహెచ్‌వోలపై వచ్చిన అనేక విమర్శలపై ఆయనే దగ్గరుండి చక్రం తిప్పి చక్కదిద్దినట్టు శాఖలో ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కొప్పులకు వ్యక్తిగత సహాయకుడిగా.. 

సాధారణ ఫార్మసిస్ట్‌గా విధులు నిర్వహించే అయన వ్యవహార శైలి బీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మారిపోయింది. అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ దగ్గర వ్యక్తిగత సహాయకుడుగా విధుల్లో చేరి అన్నీ తానై వ్యవహారాలు నడిపించారు. గతంలో ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో మంచుకొండ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో ఫార్మసిస్టుగా మోహన్ విధులు నిర్వహించేవారు. తర్వాత అదే శాఖలో కొంత మంది పై అధికారుల అండదండలతో మంత్రుల పేషీలో చోటు సంపాదించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన డిప్యూటేషన్లు రద్దు చేయడంతో మళ్లీ ఖమ్మం వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జాయిన్ అవుతున్నట్లు రిపోర్ట్ చేశారు. 

ఆఫీసర్లు ఫార్మసిస్ట్ మెహన్‌ను మధిర మండలంలోని మాటూరుపేట ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు బదిలీ చేశారు. అయితే ఆయన తన పలుకుబడిని ఉపయోగించి నాలుగు నెలల పాటు ఉద్యోగానికి వెళ్లకుండానే హాజరైనట్టు చూపించారు. ప్రస్తుత వైద్య, ఆరోగ్య శాఖ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దగ్గర నుంచి ఆదేశాలు రావడంతో అక్కడి నుంచి మళ్లీ డిప్యూటేషన్‌పై వెళ్లారు. మంత్రి దగ్గర వ్యక్తిగత సహాయకుడుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే మంత్రుల దగ్గర పీఏ, వ్యక్తిగత సహాయకులుగా పనిచేయాలంటే మినిస్ట్రియల్ ఉద్యోగులై ఉండాలని ఉద్యోగులు చెప్తున్నారు. ఫార్మసిస్టుగా ఉన్న మోహన్‌ను ఎలా పేషీలోకి తీసుకున్నారు? అని అడుగుతున్నారు.

అనుకూల పోస్టింగ్‌లు కావాలంటే కలవాల్సిందే 

రాష్ట్రంలోని వివిధ జిల్లాల డీఎంహెచ్‌వోలపై వచ్చే ఆరోపణలను మోహన్ ఆసరా చేసుకుంటున్నారు. ఆరోపణలను తొక్కిపెట్టాలంటే ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందేనని కొందరు ఆఫీసర్లు చెప్తున్నారు. రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ ముగియడంతో రాష్ట్రప్రభుత్వం బదిలీలు చేపడుతున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖలో అనుకూల పోస్టింగ్ కావాలంటే తనను కలవాలని ఇప్పటికే చాలామందికి సదరు ఉద్యోగి ఫోన్లు చేసినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో సంబంధిత శాఖలో అతని దగ్గర బంధువులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ తతంగంపై మంత్రి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793