అంకెల గారడీ తప్ప హామీల అమలుకు పాతర
కాంగ్రెస్ అసమర్ధ పాలనపై కొత్తగూడెం మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి విమర్శ
కొత్తగూడెం: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీతో నిండిపోయిందని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేసిన హామీలకు మాత్రం పాతర వేశారని కొత్తగూడెం మున్సిపల్ తాజా మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం ఒక ప్రకటన విడుదల చేసిన ఆమె, ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ వాస్తవాలను దాచిపెట్టి, అబద్ధాల అంకెలతో ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు.
ప్రధాన హామీలకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపు లేకపోవడం దారుణం
కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఘనంగా ప్రచారం చేసిన ఆరు గ్యారంటీలకు బడ్జెట్‌లో ఎలాంటి ప్రాధాన్యత లేదని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా, మహిళలకు ₹2,500 నెలసరి ఆర్థిక సహాయం, తులం బంగారం, ఉచిత స్కూటీ హామీలకు గడిచిన బడ్జెట్‌లోనూ, తాజా బడ్జెట్‌లోనూ కనీసం నయా పైసా కూడా కేటాయించలేదని మండిపడ్డారు.
నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసినట్లే!
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రామిస చేసిన రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నెలకు ₹4,000 నిరుద్యోగ భృతి అంశాలను పూర్తిగా విస్మరించిందని, బడ్జెట్‌లో వీటి ప్రస్తావన కూడా లేదని ఆమె విమర్శించారు. ఇది ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమని, యువతను నమ్మించి మోసం చేసినట్లయిందని ధ్వజమెత్తారు.
వృద్ధులకు నిరాశ - విద్యార్థులకు ఆశల వీడ్కోలు
పెన్షన్ పెంపు గురించి బడ్జెట్‌లో ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో వృద్ధుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని కాపు సీతాలక్ష్మి అన్నారు. విద్యా భరోసా గురించి ప్రస్తావన లేకపోవడం విద్యార్థులకు చేదు అనుభవాన్ని మిగిల్చిందని, ప్రభుత్వ విధానాలు విద్యా రంగాన్ని క్రమంగా నిర్లక్ష్యం చేస్తున్నాయని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం - రైతుల వాదన గాలికి
రైతులకు గుండె నింపే విధంగా ఎటువంటి ప్రోత్సాహకాలు లేకుండా, వ్యవసాయ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని, ఈ బడ్జెట్ రైతుల ఆకాంక్షలను నీరుగార్చిందని పేర్కొన్నారు.
కాంగ్రెసు పాలనకు అద్దం పడుతున్న బడ్జెట్
ఈ బడ్జెట్ అసలు కాంగ్రెసు అసమర్ధ పాలనకు అద్దం పడుతోందని, ప్రజల ఆకాంక్షలను గాలికొదిలేసిన తీరుకు ఇది నిదర్శనమని కాపు సీతాలక్ష్మి ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటేనే ప్రజలకు న్యాయం చేసినట్లవుతుందని, లేని పక్షంలో ప్రజలు త్వరలోనే దీనికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Post a Comment