కొత్తగూడెం ఏరియాలో కార్మికుల సమస్యల సాధన కోసం హెచ్ఎంఎస్ ప్రచారం
కొత్తగూడెం ఏరియాలోని పి వి కె 5 మైన్ వద్ద ఈరోజు కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పిట్ సెక్రటరీ చిట్టిబాబు నేతృత్వంలో, బ్రాంచ్ సెక్రటరీ ఆసిఫ్ అధ్యక్షతన, ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సందర్బంగా సెకండ్ షిఫ్ట్ కార్మికులను కలిసి, వారి సమస్యలను తెలుసుకొని, వారికి న్యాయబద్ధంగా లభించాల్సిన హక్కుల కోసం పోరాడతామని హెచ్ఎంఎస్ నాయకులు తెలిపారు. బ్రాంచ్ సెక్రటరీ ఆసిఫ్ మాట్లాడుతూ, గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల వైఖరి వల్ల కంపెనీ మొత్తం ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నిజంగా కార్మికుల పక్షాన ఆ సంఘాలు ఉండి ఉంటే, వీకే ఓసీ (VKOC) గురించి వాదనలు కొనసాగించకుండా స్ట్రైక్ నోటీస్‌ను మేనేజ్‌మెంట్‌కు అందజేసేవారని ఆయన విమర్శించారు.
కాంట్రాక్టు వ్యవస్థను ప్రోత్సహిస్తూ, మరోవైపు వ్యతిరేకిస్తున్నట్టు నటిస్తున్న గుర్తింపు సంఘాల తీరును ఆయన ఎండగట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదని ఆరోపించారు. స్ట్రక్చర్ మీటింగ్లలో వరుసగా హామీలు ఇస్తూ వచ్చాయని, కానీ ఇప్పటి వరకు ఏకీకృత ఒప్పందం చేయలేదని అన్నారు.
అంతేకాకుండా, ప్రైవేట్ క్యాంటీన్ల ఏర్పాటు, ఓసీలలో సర్ఫేస్ మైనర్ల నియామకం, అండర్‌గ్రౌండ్ మైన్స్‌లో ప్రైవేట్ కంపెనీల చేత బొగ్గు తీయించడాన్ని ప్రోత్సహించడం వంటి చర్యలను గుర్తింపు సంఘాలు మద్దతిస్తున్నాయని కార్మికులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో పి వి కె 5 మైన్ పిట్ సెక్రటరీ చిట్టిబాబు, ఏరియా బ్రాంచ్ సెక్రటరీ ఆసిఫ్, ఏరియా ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజశేఖర్, బ్రాంచ్ కమిటీ కన్వీనర్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment