-->

మత సామరస్యానికి ప్రతీకలు ఇఫ్తార్ విందులు

మత సామరస్యానికి ప్రతీకలు ఇఫ్తార్ విందులు


కొత్తగూడెం సింగరేణి కాలరీస్ ఏరియా జనరల్ మేనేజర్ షాలేం రాజ్ మాట్లాడుతూ, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉన్న దేశమని, ఇక్కడ కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి జీవించినప్పుడే సమాజంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని తెలిపారు.

చుంచుపల్లి మండలం రుద్రంపూర్‌లోని మస్జీద్-ఏ-ఖుబాలో జమాతే ఇస్లామి హింద్ నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆయన, మత సామరస్యాన్ని ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయుక్తమని అన్నారు. ఒకరి పండుగలను మరొకరు గౌరవించడం సమాజంలోని ఐక్యతను పెంపొందించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఉపవాసం న్యాయం, ధర్మం, ఆప్యాయత, అనురాగాలను పెంపొందించే పవిత్ర సాధనమని, నీతి నిజాయితీ కలిగి ఉన్నవారే నిజమైన దైవభక్తులని స్పష్టం చేశారు.

మరో అతిథి, ఎస్.ఓ. టు జి.ఎమ్ కోటి రెడ్డి మాట్లాడుతూ, మతాలు వేరైనా మనమంతా ఒక్కటేనని, ఉపవాసాలు మానవతా విలువలను పెంచే సాధనమని, దేశవాసులంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థన చేయాలని కోరారు.

జమాతే ఇస్లామి హింద్ అధ్యక్షుడు షేఖ్ అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ, రంజాన్ మాసంలో ఉపవాసాలు మనిషిలోని చెడులను తొలగించి, ఆకలి బాధను ఆచరణాత్మకంగా అర్థం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాయని చెప్పారు. సమాజంలోని నిరుపేదలను ఆదుకునే గుణాన్ని పెంపొందించేందుకు రంజాన్ ఉపవాసాలు సహాయపడతాయని వివరించారు. ఖురాన్ ఈ మాసంలోనే అవతరించిందని, ఇది మంచి-చెడులను తార్కికంగా అర్థం చేసుకుని ఋజుమార్గాన్ని పాటించేందుకు మార్గనిర్దేశం చేస్తుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఐ.ఎన్.టీయూ.సీ ఏరియా ఉపాధ్యక్షుడు రజాక్, కరుణాకర్రా, వురి శంకర్, గూడెల్లి యాకయ్య, షమీం, ఆలం, సోనూ బాయ్, షబ్బీర్, రబ్బానీ, కరీం తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793