-->

చెట్లు నాటి దేశభక్తిని నింపిన చిన్నారులు

రామవరం మోడ్రన్ ఇఖ్రా స్కూల్‌లో మొక్కల నాటే కార్యక్రమం


కొత్తగూడెం, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలని, "ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి – నడిచే మొక్క కావాలి" అనే సంకల్పంతో ‘చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా’ (CIO) ఆధ్వర్యంలో రామవరం సుభాష్ చంద్రబోస్ నగర్‌లోని మోడ్రన్ ఇఖ్రా స్కూల్‌లో మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు. జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థ 6-14 ఏళ్ల చిన్నారుల్లో నైతిక విలువలు, దేశభక్తి, పర్యావరణంపై అవగాహన పెంపొందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామవరం టూ టౌన్ సి.ఐ ప్రతాప్, భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) కార్యదర్శి సాబిర్ పాషా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ—"చదువుతో పాటు సమాజం పట్ల బాధ్యత బోధించే జమాతే ఇస్లామీ హింద్ శ్లాఘనీయం. చిన్నారి మనసుల్లో పర్యావరణ ప్రేమను నాటే ఈ ప్రయత్నం ప్రశంసనీయం," అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా చిన్నారులు పర్యావరణ పరిరక్షణపై అద్భుతమైన సందేశాలు అందించారు. ఖుర్ఆన్, ప్రవక్త హదీసులు ద్వారా చెట్ల ప్రాముఖ్యతను వివరించారు. "ప్రళయం ముంచుకొస్తున్నా కూడా మీ చేతిలో మొక్క ఉంటే నాటి వేయండి" అన్న ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉవాచాన్ని వారు ప్రస్తావించారు. మొక్కల సంరక్షణ, నీటి వినియోగంపై వచ్చిన హదీసులను పేర్కొన్నారు.

"చేతులు మట్టిలో, మనసులో దేశం ప్రేమ" అనే నినాదంతో CIO దేశవ్యాప్తంగా మొక్కలు నాటే మిషన్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. జూన్ నుంచి జూలై మాసాల్లో లక్షకు పైగా చెట్లు నాటి వాటి సంరక్షణ బాధ్యతను పిల్లలకే అప్పగించడం ద్వారా వారిలో బాధ్యతా బోధ పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని రుద్రంపూర్ మరియు రామవరం జమాతే ఇస్లామీ శాఖలు సమిష్టిగా నిర్వహించాయి.

కార్యక్రమంలో పాల్గొన్న వారు: జమాత్ అధ్యక్షుడు మాజిద్ రబ్బానీ, సభ్యులు అబ్దుల్ బాసిత్, షమీం, అజ్మత్, పర్వీన్ సుల్తానా, ఇర్ఫాన్, జావిద్, సుధాకర్ (టీచర్లు) తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.