ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు – ఫిల్మ్ నగర్ ఎస్సై రాజేశ్వర్ గౌడ్ మృతి
సంగారెడ్డి జిల్లా చేర్యాల గేటు వద్ద అర్ధరాత్రి దారుణ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషాదకర సంఘటనలో ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్సై రాజేశ్వర్ గౌడ్ ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే...
హైదరాబాద్ బల్కంపేటలో జరిగిన ఓ కార్యక్రమానికి బందోబస్తు కోసం విధులు నిర్వర్తించిన ఎస్సై రాజేశ్వర్ గౌడ్, విధులు ముగించుకున్న అనంతరం స్వగృహమైన సంగారెడ్డి జిల్లా చాణక్యపురి కాలనీకి కారులో తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే అర్ధరాత్రి సమయంలో చేర్యాల గేటు సమీపంలో ముందుగా వెళ్తున్న లారీని ఆయన ప్రయాణిస్తున్న కారు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది.
దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయి, లోపల ఉన్న రాజేశ్వర్ గౌడ్ తీవ్రంగా గాయపడ్డారు. అత్యంత ఘోరంగా ఘటన జరిగిన వేళ అక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
రాజేశ్వర్ గౌడ్ మృతితో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది. భార్య, పిల్లలు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. వృత్తిపరంగా విధులకు నిబద్ధతతో వ్యవహరించే రాజేశ్వర్ అకాల మరణం పోలీసు శాఖను కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. ప్రమాదానికి కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రమాద సమయంలో కారు అదుపుతప్పిందా? లేక లారీ ఏదైనా అక్రమంగా నిలిపివేసి ఉండటమే కారణమా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Post a Comment