-->

కేంద్రం సహకరించాలి యూరియా కొరతపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఆవేదన

కేంద్రం సహకరించాలి యూరియా కొరతపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల  ఆవేదన


భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రంలో యూరియా కొరత కారణంగా ఖరీఫ్ సాగు తీవ్రంగా ప్రభావితమవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడిఓసి కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “రాష్ట్రానికి తగినంత యూరియా తక్షణం సరఫరా చేయకపోతే పంటల దిగుబడిపై తీవ్రమైన ప్రభావం పడే ప్రమాదం ఉంది,” అని హెచ్చరించారు.

ఆగస్టు నెల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, అదనంగా మూడు లక్షల మెట్రిక్ టన్నుల (3 LMTs) యూరియాను రాష్ట్రానికి కేటాయించాలని కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా కు లేఖ రాశానని ఆయన వెల్లడించారు. “జూన్, జూలై నెలల్లో సరఫరా తక్కువగా ఉండడంతో రైతులు ఇప్పటికే నష్టపోతున్నారు,” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 1.45 లక్షల మెట్రిక్ టన్నుల యూరియానే మిగిలి ఉండగా, ఏప్రిల్ నుంచి జూలై మధ్య 2.37 లక్షల మెట్రిక్ టన్నుల లోటు నమోదైందని పేర్కొన్నారు. వరి, పత్తి, మక్క వంటి పంటల సాగు కోసం యూరియా అత్యంత అవసరమని, రాష్ట్రవ్యాప్తంగా 1.16 కోట్ల ఎకరాల భూమిలో సాగు జరగుతోందని వివరించారు.

“రైతుల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే, కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలి. అవసరమైన యూరియాను సమయానికి పంపిణీ చేయాలి,” అంటూ కేంద్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు కేంద్రం అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మరింత సహకారం అందించాలని లేఖలో అభ్యర్థించారు.

ఈ సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేకాధికారి సురేంద్రమోహన్, ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘురామ రెడ్డి, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.