రాజాసింగ్ రాజీనామా ఆమోదించిన బీజేపీ హైకమాండ్
హైదరాబాద్, తెలంగాణ బీజేపీలో నెలకొన్న అంతర్గత అసంతృప్తులకు మరో మలుపు తిరిగింది. గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను పార్టీ హైకమాండ్ ఆమోదించింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నికల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన రాజాసింగ్.. ఇటీవలే బహిరంగంగానే విమర్శలు చేస్తూ పార్టీ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
రాజాసింగ్ రాజీనామాను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. జూలై 11న విడుదల చేసిన లేఖలో ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశాన్ని తమకు ఇవ్వలేదని రాజాసింగ్ గతంలో ఆరోపించారు. బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా రాజాసింగ్ వ్యవహరించినట్లు పార్టీ అంతర్గతంగా భావించడంతో ఆయన రాజీనామాను ఆమోదించినట్లు సమాచారం.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాజాసింగ్ పంపిన రాజీనామా లేఖను హైకమాండ్ కు రవాణా చేశారు. అనంతరం లేఖను పరిశీలించిన పార్టీ నాయకత్వం, ఇప్పటికే ఆయన పార్టీపై పరోక్ష విమర్శలు చేసిన విషయాన్ని పరిగణలోకి తీసుకుని, రాజీనామా ఆమోదించడమే సమంజసం అని నిర్ణయించినట్లు తెలిసింది.
ఈ పరిణామాలతో తెలంగాణ బీజేపీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టినట్లుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజాసింగ్ భవిష్యత్ రాజకీయ ప్రస్థానంపై పలు ఊహాగానాలు చెలామణీ అవుతున్నాయి. ఆయన మరే పార్టీలోకి వెళ్తారో..? స్వతంత్రంగా కొనసాగుతారో..? అన్నది ఆసక్తికరంగా మారింది.
Post a Comment