కల్తీ కల్లు దుకాణాలపై ఎక్సైజ్ శాఖ దాడులు – పలుచోట్ల సీజ్
హైదరాబాద్, కూకట్‌పల్లిలో కల్తీ కల్లు వల్ల ఉత్పన్నమైన విషాద ఘటనపై అధికారులు ఎట్టకేలకు కళ్లెం వేశారు. ఇప్పటికే ఈ కల్తీ కల్లు కారణంగా 9 మంది మృతి చెందగా, మరో 50 మందికిపైగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అత్యవసరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయగా, బాలనగర్ ఎక్సైజ్ అధికారులు శుక్రవారం ఉదయం కూకట్‌పల్లి పరిధిలోని షంషిగూడ, హైదర్‌నగర్, భాగ్యనగర్, సర్దార్ పటేల్ నగర్, సాయిచరణ్ కాలనీ తదితర ప్రాంతాల్లో ఉన్న కల్లు దుకాణాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
సంబంధిత దుకాణాల్లో నుంచి కల్లు నమూనాలను సేకరించిన అధికారులు, పరీక్షల అనంతరం మత్తు పదార్థాలు అధిక మోతాదులో ఉండటం తేలడంతో ఆయా దుకాణాలను సీజ్ చేసి తాళాలు వేసి సీల్ వేశారు. ఇప్పటికే ఈ కల్లు సరఫరాకు సంబంధించి ముఠాపై కేసులు నమోదు చేయడంతో పాటు, మరిన్ని అరెస్టులు జరుగే అవకాశం ఉందని సమాచారం.
స్థానికులు కల్తీ కల్లు వ్యాపారంపై సుదీర్ఘకాలంగా ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ స్పందన ఆలస్యం కావడాన్ని వారు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Post a Comment