బురదమయంగా మారిన రహదారి.. నడవలేని స్థితి
వాంకిడి (కొమురం భీం జిల్లా), వాంకిడి మండలంలోని బంబార గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న రాజీవ్ నగర్ ఆదివాసీ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలతో నిండిపోయి మురికిగా, బురదమయంగా మారింది. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఈ రహదారిలో పయనించడం ప్రజలకు తీరని కష్టంగా మారింది.
ప్రతిరోజూ వాంకిడి మండల కేంద్రానికి వెళ్తున్న గ్రామస్తులు రాకపోకలలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బైకులు, ఆటోలు, బోలోరో, టాటా ఏస్ వంటివాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ కూడా చేరలేని స్థితి నెలకొంది.
పాఠశాలకు ఉపాధ్యాయులు రావడం సైతం దాదాపు అసాధ్యమైంది. పిల్లలు విద్యాభ్యాసంలో వెనుకపడిపోతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"ఎన్నికల సమయంలో రోడ్డు మరమ్మతులు చేస్తామంటూ హామీలు ఇచ్చిన నాయకులు, అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు కనీసం ఇప్పటికైనా స్పందించాలి" అని గ్రామస్థులు వాపోతున్నారు.
Post a Comment