కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ ఆరా..!!
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఆరోగ్య పరిస్థితిపై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. గురువారం సాయంత్రం స్వల్ప అనారోగ్యంతో సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ వైద్యులు, ఆసుపత్రి అధికారులతో మాట్లాడారు.
కేసీఆర్‌కు అత్యుత్తమ వైద్యం అందించాలంటూ సీఎం సూచించారు. ఆయన త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని ఆకాంక్షించారు. యశోద ఆసుపత్రిలో కేసీఆర్‌కు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆయన వెంట సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్, బంధువు హరీశ్ రావు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు.
కేసీఆర్ ఆరోగ్యంపై ఆసుపత్రి వర్గాలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. స్వల్ప నీరసం, రక్తంలో షుగర్, సోడియం లెవల్స్ పెరుగుదల కారణంగా ఆయనను పరీక్షల నిమిత్తం హాస్పిటల్‌లో అడ్మిట్ చేసినట్టు సమాచారం.

Post a Comment