మున్నేరు నీటి ప్రవాహం – ఖమ్మంలో ట్రాఫిక్ మళ్లింపు
ఖమ్మం నగరంలో మున్నేరు నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలోని కాల్వడ్డు నుండి నాయుడుపేట మున్నేరు వంతెన వద్ద గల చప్టా (లోతట్టు వంతెన)పైకి ఉదయం నుండే నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో, అక్కడి వాహన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఈ మేరకు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బెల్లం సత్యనారాయణ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, ప్రజల భద్రత దృష్ట్యా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలైన ప్రకాష్‌నగర్ వంతెన మరియు కరుణగిరి వంతెనల మీదుగా ప్రయాణించాలన్నారు. వరద నీటి ప్రవాహం తగ్గిన వెంటనే ట్రాఫిక్ పునరుద్ధరించనున్నట్లు స్పష్టం చేశారు.
వర్షాల ప్రభావంతో నదుల్లో నీటి మట్టం పెరిగిన నేపథ్యంలో, అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందకుండా అధికారుల సూచనల మేరకు ప్రయాణించాలని కోరారు.

Post a Comment