-->

20 సంవత్సరాల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి విచ్చేసిన మొదటి సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణకు ప్రత్యామ్నాయ పదం ఉస్మానియా యూనివర్సిటీ : సీఎం రేవంత్


హైదరాబాద్, రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర బిందువుగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీ వేదికపై 20 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో అడుగుపెట్టిన తొలి నాయకుడిగా రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించారు. సోమవారం ఓయూ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, కీలక వ్యాఖ్యలు చేశారు.

“తెలంగాణకు ప్రత్యామ్నాయ పదం ఉస్మానియా యూనివర్సిటీ” అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. పీవీ నరసింహారావు ఓయూ గడ్డనుంచి ధిక్కార స్వరం వినిపించారని గుర్తుచేశారు. తొలి తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శకులైన మర్రి చెన్నారెడ్డి, జైపాల్ రెడ్డి, గద్దర్ లాంటి మహనీయులను అందించిన నేల ఓయూ అని అన్నారు.

చదువుతో పాటు పోరాట పాఠాలు నేర్పిన విద్యాలయమిది అని ఆయన చెప్పారు. “శ్రీకాంత్ చారి అమరుడైనా ఆయన కుటుంబానికి ఏమి చేయలేకపోయాం. రాజకీయ నాయకులు అప్పట్లో తమ స్వార్ధం కోసం పోరాటాలను వాడుకున్నారు” అని అన్నారు. దేశానికి న్యాయవాదులు, వైద్యులు మాత్రమే కాకుండా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారి వర్గాన్ని అందించిన గడ్డ కూడా ఉస్మానియానే అని గుర్తు చేశారు.

ఓయూను కళాహీనంగా మార్చేందుకు ప్రయత్నించారని ఆరోపించిన సీఎం, “తెలంగాణ సమాజానికి మేలుకొలిపే ఈ గడ్డను కాలగర్భంలో కలపాలని చూశారు” అంటూ మండిపడ్డారు. దళిత బిడ్డను వీసీగా నియమించామన్న ఆయన, “తెలంగాణకు మేధా సంపత్తి ఓయూనుంచే రావాలి” అని స్పష్టం చేశారు.

యువతనే దేశ భవిష్యత్తు అని చెబుతూ, రాజకీయంగా చైతన్యం కలిగిన యువకులను ప్రోత్సహిస్తామన్నారు. అయితే, “జూనియర్, డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులు గంజాయి వాడకం పెంచుకుంటున్నారు. డ్రగ్స్ మహమ్మారి తెలంగాణ సమాజాన్ని పట్టిపీడిస్తోంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793