-->

సెప్టెంబర్ 6న గూడెంలో గణేష్ నిమజ్జనం ఉత్సవ కమిటీ

సెప్టెంబర్ 6న గూడెంలో గణేష్ నిమజ్జనం ఉత్సవ కమిటీ


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరిగే వినాయక ఉత్సవాలు ఈనెల 27న ప్రారంభమై, సెప్టెంబర్ 6న జరిగే నిమజ్జన మహోత్సవంతో ముగుస్తాయని గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు లక్ష్మణ్ తెలిపారు. సోమవారం పట్టణంలోని భజన మందిరం సమీపంలో ఉన్న వివేకానంద హైస్కూల్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “హైదరాబాద్ తరువాత ఆ స్థాయిలో ఒక్క కొత్తగూడెంలోనే గణేష్ ఉత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. గత 50 ఏళ్లుగా సాంప్రదాయ బద్ధంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో నిర్వహించేందుకు కమిటీ సిద్ధమవుతోంది” అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించడం హర్షణీయమని అభివర్ణించారు. అయితే, ఆ సదుపాయాన్ని దుర్వినియోగం చేయకుండా, మండప నిర్వాహకులు బాధ్యతగా వినియోగించుకోవాలని సూచించారు. మండపాల నిర్మాణం వల్ల స్థానికులు, వాహనదారులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

నిమజ్జన రోజు విగ్రహాలు సాయంత్రం 4 గంటలకు ప్రకాశం స్టేడియంలో చేరి, పూజా కార్యక్రమాలు అనంతరం శోభాయాత్రగా సూపర్ బజార్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన స్వాగత వేదిక వరకు తీసుకువెళ్ళాలని తెలిపారు. యువత మద్యం, గంజాయి వంటి వ్యసనాలకు దూరంగా ఉంటూ భక్తి భావంతో కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చారు.

గణేష్ మండపాలకు బ్యానర్లు, జెండాలు, పూజా ద్రవ్యాలు ఉచితంగా పంపిణీ చేస్తామని కమిటీ ప్రకటించింది.

ఈ సమావేశంలో ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షులు కొదమ సింహం పాండురంగాచార్యులు, పలివేల సాంబశివరావు, విశ్వహిందూ పరిషత్ ఖమ్మం విభాగ్ ప్రధాన కార్యదర్శి గడదేశి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి దారా రమేష్, ఉపాధ్యక్షులు మెరుగు చింటేశ్వరరావు, కోశాధికారి వందనపు శ్రీధర్, ప్రచార కార్యదర్శి గుమలాపురం సత్యనారాయణ, కొల్లు పద్మ, సాగర్, సందీప్, పులిగంటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793