సహస్ర హత్య కేసు.. భవనంలోనే హంతకులు.. వీడని మిస్టరీ!
హైదరాబాద్ : కూకట్‌పల్లి ప్రాంతంలో చిన్నారి సహస్ర (10) దారుణ హత్య కేసు నగరాన్ని కుదిపేసింది. బాలిక శరీరంపై దాదాపు 20 కత్తి గాయాలు బయటపడటంతో ఈ ఘాతుకం పక్కా ప్రణాళికతోనే జరిగిందని పోలీసులు స్పష్టంచేశారు. అయితే హంతకులు ఎవరు? ఏ కారణంతో ఈ నేరానికి పాల్పడ్డారు? అన్నది ఇంకా మిస్టరీగానే ఉంది.
🔴 భవనానికే పరిమితమైన దర్యాప్తు
సహస్ర నివాసముంటున్న జీ+2 భవనంనే ఈ కేసులో ప్రధాన కేంద్రబిందువుగా మారింది. భవనం గేటు నుంచి ఆ సమయంలో ఎటువంటి బాహ్యులు లోపలికి రాలేదని దర్యాప్తులో తేలడంతో, హత్యకు పాల్పడింది అదే భవనంలోని వ్యక్తులేననే అనుమానం బలపడుతోంది.
🔴 అనుమానితుల విచారణ
ఇప్పటివరకు నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే ఎటువంటి స్పష్టత రాకపోవడంతో మంగళవారం సాయంత్రం బాలిక తల్లిదండ్రులు కృష్ణ, రేణుకలను కూడా పిలిపించి వివరాలు సేకరించారు. ఆర్థిక లావాదేవీలు లేదా వ్యక్తిగత కక్షల కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
🔴 హత్య భయంకరత
పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం సహస్ర శరీరంపై 20 కత్తిగాయాలు ఉండగా, ఒక్క మెడపై 10 వరకు పోట్లు కనిపించాయి. సోమవారం ఉదయం 9.30 నుంచి 10.30 గంటల మధ్యలో ఈ ఘాతుకం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. అదే సమయంలో చిన్నారి కేకలు విన్నట్లు పొరుగువారు చెప్పడం దీనికి బలం చేకూర్చింది.
🔴 సాంకేతిక ఆధారాలపై దృష్టి
హత్య ఆవేశంలో కాదని, బలమైన కక్షతో పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. చేతబడి నెపం ప్రచారాన్ని వారు ఖండించారు. ఘటనా స్థలంలో సేకరించిన వేలిముద్రలు, మొబైల్ ఫోన్ డేటాను పరిశీలిస్తూ సాంకేతిక ఆధారాలపై దృష్టి పెట్టారు.
🔴 అంత్యక్రియలు
సహస్ర మృతదేహాన్ని సోమవారం రాత్రి స్వగ్రామమైన సంగారెడ్డి జిల్లా మక్తాక్యాసార్లో అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల రోదనలు ఆ ప్రాంతాన్ని కదిలించాయి.

Post a Comment