-->

హత్య కేసు ఛేదించిన తూప్రాన్ పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలింపు

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని మద్యం తాగించి హత్య

మెదక్ జిల్లా, తూప్రాన్ పోలీసులు 9 నెలల క్రితం జరిగిన పాత హత్య కేసును ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్న కొడుకును, తల్లి తన ప్రియునితో కలిసి పథకం ప్రకారం హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాలు ఇలా ఉన్నాయి: తూప్రాన్ మండలం వెంకటాయిపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ రహేన, సిద్దిపేట జిల్లా మక్తమైలారం గ్రామానికి చెందిన జహంగీర్‌ను వివాహం చేసుకుంది. భర్త మరణించిన తర్వాత రహేన, మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లికి చెందిన కందల బిక్షపతితో సహజీవనం కొనసాగిస్తోంది. ఈ సంబంధానికి రహేన కుమారుడు అహమ్మద్ పాషా అడ్డుపడతుండడంతో, ఇద్దరూ అతన్ని హత్య చేయాలని నిర్ణయించారు.

పథకం ప్రకారం 2024 నవంబర్ 28న పాషాకు విపరీతంగా మద్యం తాగించి, ప్లాస్టిక్ వైరు మరియు చున్నీతో గొంతు బిగించి చంపేశారు. అనంతరం ఏపీ 23 ఏఎం 7574 నంబరు గల మోటార్‌సైకిల్‌పై శవాన్ని హాల్దీ వాగులో పడేశారు. అప్పట్లో కేసు గుర్తుతెలియని శవం మృతిగా క్రైమ్ నెంబర్ 432/2024 U/S 103(1), 238 BNS కింద నమోదు అయింది.

తూప్రాన్ సీఐ రంగకృష్ణ, ఎస్‌ఐ శివానందం ఆధ్వర్యంలో ఐడి పార్టీ సిబ్బంది గోవర్ధన్, కృష్ణ, వెంకట్, నరేందర్, దుర్గేశ్, సురేష్‌లతో ప్రత్యేక బృందం ఏర్పడి దర్యాప్తు జరిపి, నిందితులైన రహేన, బిక్షపతిని పట్టుకున్నారు. విచారణలో వారు నేరాన్ని అంగీకరించడంతో, అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

డీఎస్పీ నరేందర్ గౌడ్ ఈ కేసు విజయవంతంగా ఛేదించిన సిబ్బందిని అభినందించి, వారికి రివార్డులు ఇవ్వాలని జిల్లా ఎస్పీకి సిఫార్సు చేసినట్లు తెలిపారు.

Blogger ఆధారితం.