అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కన్న కొడుకును హతమార్చిన తల్లి
తూప్రాన్ : అక్రమ సంబంధం కోసం ఒక తల్లి స్వంత కుమారుడినే చంపిన ఘోర ఘటన తూప్రాన్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై తూప్రాన్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ నరేందర్ గౌడ్ వివరాలు వెల్లడించారు.
గత సంవత్సరం సెప్టెంబర్ 28న తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని హల్దీ వాగులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు జరిపి మృతుడు వెంకటయపల్లి గ్రామానికి చెందిన అహ్మద్ పాషా (25) అని గుర్తించారు. అయితే కుమారుడు కనిపించకపోయినా, మృతుడి తల్లి మహమ్మద్ రహేన ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం అనుమానాస్పదంగా మారింది.
దీంతో రహేనను విచారించిన పోలీసులు షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ఆమెకు మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కందల బిక్షపతితో అక్రమ సంబంధం ఉంది. ఈ బంధానికి కుమారుడు అహ్మద్ పాషా అడ్డుగా నిలుస్తున్నాడని భావించి, రహేన, బిక్షపతి కలిసి అతన్ని బైక్‌పై అబోతుపల్లికి తీసుకెళ్లి, మద్యం తాగించి, అనంతరం చున్నీతో మెడ నులిమి హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని హల్దీ వాగులో పడవేసి అక్కడి నుంచి పారిపోయారు.
ఈ కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కేసు ఛేదనలో కీలకపాత్ర పోషించిన సీఐ రంగా కృష్ణ, ఎస్ఐ శివనందం, కృష్ణ, రాజు తదితర సిబ్బందిని డీఎస్పీ నరేందర్ గౌడ్ అభినందించారు.
Post a Comment