రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ప్రారంభం
నేరాలకు సంబంధించి సంఘటన స్థలంలోనే నిందితులను గుర్తించడం, సాక్ష్యాధారాలను సేకరించడం కోసం ఫోరెన్సిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ, తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ విభాగం రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు నూతన మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని అందజేసింది.
ఈ వాహనాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కమిషనరేట్ కార్యాలయ ప్రాంగణంలో పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, అత్యాధునిక పరికరాలతో రూపొందించిన ఈ మొబైల్ ఫోరెన్సిక్ వాహనం రామగుండం పోలీస్ కమిషనరేట్ దర్యాప్తు వ్యవస్థను మరింత బలోపేతం చేయనుందని తెలిపారు. ఇకపై నేరం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్ అధికారులు, ఫింగర్‌ప్రింట్ నిపుణులు ఈ వాహనంలో చేరుకుని సంఘటన స్థలంలోనే రక్తమరకలు, వ్రేలిముద్రలు వంటి సాక్ష్యాధారాలను సేకరించి, వాహనంలో ఏర్పాటు చేసిన పరికరాలతో ప్రాథమిక పరీక్షలు నిర్వహించి సంబంధిత దర్యాప్తు అధికారికి అందజేస్తారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, ఏఓ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏ.రాము, అసిస్టెంట్ డైరెక్టర్ RFSL మంచిర్యాల్, ఇన్స్పెక్టర్లు రవీందర్, చంద్రశేఖర్ గౌడ్, ఆర్ఐలు దామోదర్, మల్లేశం, ఆర్‌ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్, సీసీ హరీష్‌తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది, క్లూస్ టీమ్, RFSL సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment