-->

యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు అన్నదాతలు ఆగ్రహం

యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు అన్నదాతలు ఆగ్రహం


హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో యూరియా బస్తాల కొరత రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తోంది. గంటల తరబడి క్యూల్లో నిలబడ్డా, బస్తా దొరకడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గద్వాల, ఖానాపురం, తొర్రూర్‌, గంభీరావుపేట ప్రాంతాల్లో రైతులు యూరియా కోసం రోడ్డెక్కారు. రోజుల తరబడి వ్యవసాయ సహకార సంఘాల చుట్టూ తిరిగినా యూరియా అందకపోవడంతో ఆందోళనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రాస్తారోకోలు చేపట్టి నిరసనలు తెలియజేశారు. రైతులకు తక్షణమే సరిపడా యూరియా పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు.

నల్లబెల్లి మండలం మేడిపల్లి సొసైటీలో యూరియా కోసం ఉదయం 5 గంటల నుంచే రైతులు క్యూలో నిలబడ్డారు. పంపిణీ సమయంలో తోపులాట జరగడంతో ఒక రైతు స్వల్పంగా గాయపడ్డాడు.

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం బుధరావుపేట రైతు వేదిక వద్ద రాస్తారోకో చేపట్టిన రైతులకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మద్దతు తెలిపారు. రాష్ట్రంలో యూరియా కొరతకు కాంగ్రెస్ సర్కారు వైఫల్యమే కారణమని ఆయన విమర్శించారు.

అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో రైతుల ధర్నాకు మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత మద్దతు తెలిపారు. ధర్నాలో పాల్గొని రైతుల సమస్యలపై గళమెత్తారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793