-->

మణుగూరులో నూతన బ్లడ్ బ్యాంక్ ప్రారంభం

 

రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్

మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన రక్త నిల్వ కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అధికారికంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ రిబ్బన్ కటింగ్ చేసి, బ్లడ్ బ్యాంక్‌లో నిర్వహించిన ఏర్పాట్లను సమీక్షించారు.

ప్రారంభోత్సవం సందర్భంగా కలెక్టర్ స్వయంగా రక్తదానం చేసి ప్రజలకు రక్తదానంపై అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలిచారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ "రక్తదానం అంటే ప్రాణదానం. మనం ఇచ్చే ఒక్క యూనిట్ రక్తం ఇతరరికి జీవం పోసే వరంగా మారుతుంది. గర్భిణీలు, తలసీమియా, సికిల్ సెల్, అనీమియా వంటి వ్యాధుల బాధితులు, ప్రమాదాల్లో గాయపడినవారు రక్తానికి ఆధారపడుతారు. ప్రతి ఆరోగ్యవంతుడు ఏడాదికి కనీసం రెండు సార్లు రక్తదానం చేయాలి" అని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్ఫూర్తితో డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు, ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ సునీల్, ఇతర వైద్య సిబ్బంది ముందుకు వచ్చి రక్తదానం చేశారు. మొత్తం 20 మంది రక్తదానం చేశారు. ఈ రక్తం నూతన బ్లడ్ బ్యాంక్‌లో నిల్వ చేసి అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వారికి ఉపయోగిస్తారు.

ఇప్పటి వరకు మణుగూరులో రక్తం అవసరాల కోసం ఖమ్మం, భద్రాచలం వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ఇకపై స్థానికంగా రక్తం అందుబాటులోకి రావడం ద్వారా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్పెషలిస్ట్ వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.