సీపీఐ నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి మరణం తీరని లోటు: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: సీపీఐ అగ్రనేత, మాజీ ఎంపీ కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణం నిరుపేదలకు, బహుజనులకు, సిద్ధాంతపరమైన రాజకీయాలను శ్వాసగా నడిపే ప్రతి ఒక్కరికీ తీరని లోటు అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు.
ముఖ్యమంత్రి ఆదివారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్‌లో సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, నేతలు కె.నారాయణ, కూనంనేని సాంబశివరావు, అజీజ్ పాషా తదితరులను కలిసిన సీఎం, సుధాకర్ రెడ్డి సేవలను స్మరించుకున్నారు.
“విద్యార్థి రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వరకు ఆయన నిరాడంబర జీవితం, రాజీపడని సిద్ధాంతం అందరికీ స్ఫూర్తిదాయకం. ఏఐఎస్ఎఫ్ నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఎదిగినా అహంకారం ఆయన దరిదాపులకు రాలేదు. పాలమూరు బిడ్డగా సుధాకర్ రెడ్డి, బూర్గుల రామకృష్ణ రావు, జైపాల్ రెడ్డి ల కోవలో పాలమూరు జిల్లాకు ఎంతో వన్నె తెచ్చారు” అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
సీపీఐ నేతగా ఆయన సూచన మేరకు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప రెడ్డి పేరు పెట్టామని గుర్తు చేసుకున్నారు. “ఆ సందర్భంలో ఆయనను వ్యక్తిగతంగా కలుస్తానని చెప్పినా ఆలస్యమైంది. ఇలాంటివిధంగా కలుసుకోవాల్సి వస్తుందని ఊహించలేదు” అని సీఎం భావోద్వేగానికి లోనయ్యారు.
సురవరం సుధాకర్ రెడ్డి సిద్ధాంతపరమైన రాజకీయాలకు గౌరవార్థం ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయం తీసుకుంటుందని, దీనిపై మంత్రివర్గంలో చర్చిస్తామని సీఎం స్పష్టం చేశారు. కాంగ్రెస్ సమావేశంలో కూడా ఆయన సేవలను స్మరించామని, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంతాప సందేశం పంపారని తెలిపారు.
“విలువలతో కూడిన నాయకుల పట్ల ప్రభుత్వానికి ఎల్లప్పుడూ సానుభూతి ఉంటుంది. అందుకే కొండా లక్ష్మణ్ బాపూజీ, చాకలి ఐలమ్మ, జైపాల్ రెడ్డి, గద్దర్ పేర్లను చిరస్థాయిగా నిలిపినట్లు, సుధాకర్ రెడ్డి జ్ఞాపకాన్ని కూడా శాశ్వతం చేస్తాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Post a Comment