మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – ముగ్గురు కూలీల మృతి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం మధ్యాహ్నం భయానక రోడ్డు ప్రమాదం జరిగింది. మొక్కలు నాటే పనికి వచ్చిన కూలీలపై ట్రక్కు దూసుకెళ్లడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
మృతులు – ఒడిశాకు చెందిన నారాయణ (22), చెక్ మోహన్ (21), జైరామ్ (30). రెండు రోజుల క్రితమే జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చిన వీరు, శామీర్‌పేటలో నివసిస్తూ, ఇతర కూలీలతో కలిసి రింగ్ రోడ్డుపై మొక్కలు నాటే పనిలో ఉన్నారు.
మధ్యాహ్నం పని ముగించుకొని భోజనానికి వెళ్తుండగా, విశాఖపట్నం జిల్లా గాజువాక నుంచి మేడ్చల్ వైపు వస్తున్న ట్రక్కు వీరిని ఢీ కొట్టింది. తీవ్ర గాయాలతో ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ట్రక్ డ్రైవర్ గణేష్ నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అతన్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
Post a Comment