-->

నిజాంసాగర్ ప్రాజెక్టులో యువకుడు గల్లంతు

నిజాంసాగర్ ప్రాజెక్టులో యువకుడు గల్లంతు


నిజాంసాగర్ ప్రాజెక్టులో శనివారం సాయంత్రం విషాదకర ఘటన చోటుచేసుకుంది. పిట్లం మండలం అల్లాపూర్ గ్రామానికి చెందిన గైని పండరి (28) అనే యువకుడు నీటిలో గల్లంతయ్యాడు.

పర్యాటకుల ముందు నీటిలో దూకిన యువకుడు

స్థానిక ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం, పండరి తన ద్విచక్ర వాహనంపై ప్రాజెక్టు వద్దకు వచ్చి గార్డెన్‌లో వాహనాన్ని ఉంచి, పర్యాటకుల సమక్షంలోనే నీటిలోకి దూకాడు. అయితే పైకి రాకపోవడంతో భయాందోళనకు గురైన స్థానికులు, పర్యాటకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ద్విచక్ర వాహనం ఒడ్డుపైనే

సమాచారం అందుకున్న ఎస్ఐ శివకుమార్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఒడ్డుపై నిలిపిన ద్విచక్ర వాహనం పండరియదే అని గుర్తించారు. యువకుడు కావాలనే ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేక ఈత రాక నీటిలో మునిగిపోయాడా? అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కుటుంబంలో కన్నీటి మడుగులు

మృతునికి తల్లి లచ్చవ్వ, తండ్రి హన్మండ్లు, తమ్ముడు తుకారాం ఉన్నారు. తమ్ముడు తుకారాం జమ్ము కాశ్మీర్‌లో ఆర్మీ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793