-->

చలో ఢిల్లీ కార్యక్రమానికి బయలుదేరిన కాంగ్రెస్ బీసీ నాయకులు

చర్లపల్లి స్టేషన్‌లో ఘనంగా వీడ్కోలు, బీసీలకు రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీ పయనం


హైదరాబాద్, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో ఢిల్లీ ఉద్యమానికి తెలంగాణ నుంచి బీసీ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొనుతున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం చర్లపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి ప్రత్యేక రైలులో వారు ఢిల్లీకి బయలుదేరారు.

వీరిలోని నాయకులకు తెలంగాణ పీసీసీ జనరల్‌ సెక్రటరీ నాగ సీతారాములు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లపై కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన నిబద్ధతను కలిగి ఉంది. కానీ ఇతర పార్టీలు మాత్రం రెండు నాలుకల ధోరణిని అవలంబిస్తున్నాయి. ఇది తీవ్రంగా ఖండనీయమైన విషయం,” అని విమర్శించారు.

అలాగే, “పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలి. లేకపోతే దేశవ్యాప్తంగా బీసీలు బీజేపీకి గుణపాఠం చెబుతారు. ఇది ఒక్క కాంగ్రెస్ పార్టీ కాదు, అన్ని పార్టీల బీసీ నాయకులు కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన సమయం,” అని సీతారాములు పిలుపునిచ్చారు.

ఈ చలో ఢిల్లీ కార్యక్రమం ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమం ద్వారా బీసీ హక్కుల సాధనకు జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేలా కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక వేసుకుంది.

ఈ సందర్భంగా రైల్వే స్టేషన్‌ వద్ద కార్యకర్తలు, నాయకులు జెండాలు, నినాదాలతో హర్షాతిరేకాల మధ్య బీఎస్ రిజర్వేషన్‌ల సాధనకు బలమైన సంకల్పాన్ని వ్యక్తం చేశారు.

Blogger ఆధారితం.